మరికొన్నాళ్లు‘డ్వాక్రా’ కిందే ఇసుక రేవులు

29 Jan, 2016 18:01 IST|Sakshi

ఈ - టెండర్లు కమ్ ఈ - వేలం ప్రక్రియలు ముగిసే వరకూ ఇసుక రేవులు డ్వాక్రా మహిళా సంఘాల చేతుల్లోనే ఉండనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని, అందువల్ల ఈ తేదీనాటికి ఇసుక రేవులన్నింటినీ భూగర్భ గనుల శాఖకు అప్పగించాలంటూ డ్వాక్రా మహిళా సంఘాలు (రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ - సెర్ప్)ను ప్రభుత్వం గతంలో ఆదేశించింది.


అయితే రేవుల టెండరు ప్రక్రియ పూర్తికావడానికి మరో పక్షం రోజులు వరకూ పట్టే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. ఇసుక రేవుల అప్పగింత తేదీపై నిర్ణయాధికారాన్ని జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు (డీఎల్‌ఎస్సీలకు) అప్పగించింది. ఈనెల ఒకటో తేదీ లేదా డీఎల్‌ఎస్సీలు నిర్ణయించిన తేదీ నుంచి ఇసుక రేవులు భూగర్భ గనుల శాఖ పరిధిలోకి వస్తాయని, అప్పటి వరకూ డ్వాక్రా సంఘాల చేతుల్లోనే ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు భూగర్భ గనుల శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు