డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్

28 Sep, 2016 00:24 IST|Sakshi
డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్

* పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు   
* పీపుల్స్ ప్లాజాలో ప్రారంభమైన డ్వాక్రా బజార్

సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలు తమ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ లభిస్తుండటమే ఇందుకు నిదర్శనమని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకం, ప్రదర్శన నిమిత్తం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పీపుల్స్ ప్లాజా (హైదరాబాద్)లో ఏర్పాటు చేసిన తెలంగాణ డ్వాక్రా బజార్ (సరస్-2016)ను మంగళవారం మంత్రి జూపల్లి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు బలంగా ఉన్నాయని, ఆయా సంఘాలు తయారు చేసే వస్తువులు, ఆహార ఉత్పత్తులకు మంచి ఆదరణ  ఉందన్నారు. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆన్‌లైన్ ద్వారా డ్వాక్రా ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం ఉదారంగా రుణాలను అందించాలని బ్యాంకర్లకు మంత్రి జూపల్లి విజ్ఞప్తి చేశారు. సెర్ప్ సీఈవో అనితా రాంచంద్రన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి డ్వాక్రా బజార్ నిర్వహిస్తున్నామని.. అక్టోబర్ 7వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు.

రాష్ట్ర ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా బజార్‌ను ప్రారంభించిన మంత్రి జూపల్లి అన్ని స్టాళ్లను పరిశీలించి వసతుల కల్పన గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సెర్ప్ డెరైక్టర్లు రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశం, శ్రీనివాస్‌రావు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
 
ఆకట్టుకుంటున్న డ్వాక్రా బజార్ స్టాల్స్: సెర్ప్ ఏర్పాటుచేసిన డ్వాక్రా బజార్ స్టాళ్లలో తెలంగాణతో పాటు దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన డాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత, పోచంపల్లి చీరలు, కొండపల్లి బొమ్మలు, సోలార్ లైట్లు, గృహ అలంకరణ వస్తువులు, వెదురు బొమ్మలు, ఆటవస్తువులు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. డ్వాక్రా బజార్‌లో ఏర్పాటు చేసిన 325 స్టాళ్లలో మొత్తం రూ.5 కోట్ల విలువైన వస్తువులను ప్రదర్శన, అమ్మకానికి ఉంచినట్లు అధికారులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా