ఫ్యాన్సీ నంబర్లకు ఈ-టెండర్

18 Jan, 2016 11:50 IST|Sakshi
ఫ్యాన్సీ నంబర్లకు ఈ-టెండర్

డీలర్ వద్దే వాహన రిజిస్ట్రేషన్‌కు రవాణా శాఖ కసరత్తు
ఫిబ్రవరి నుంచి రవాణా సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

 
సాక్షి, హైదరాబాద్: కొత్తగా వాహనాల్ని కొనుక్కుని ఫ్యాన్సీ నంబర్లు పొందాలంటే ఇకపై ఈ-టెండర్లలో పోటీ పడాల్సిందే. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి నుంచి రవాణా శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఫ్యాన్సీ నంబర్లకున్న గిరాకీ దృష్ట్యా అధిక ఆదాయం ఆర్జించేందుకు కొత్త రిజిస్ట్రేషన్ చట్టాన్ని అమలు చేయనుంది. దీనిద్వారా బ్రోకర్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ఆ మేరకు ఫ్యాన్సీ నంబరు కావాలంటే వాహన యజమానులు రిజిస్ట్రేషన్‌కు ముందు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. రవాణాశాఖ నిర్దేశించిన ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవాలంటే కచ్చితంగా ఈ-టెండర్ విధానంలో పాల్గొనాలి. ఇప్పటివరకు ఆయా నంబర్లకున్న డిమాండ్‌ను బట్టి ధరను నిర్ణయించి ఆయా జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు సీల్డ్ టెండర్లు కోరేవారు.

ఉదాహరణకు 9999 ఫ్యాన్సీ నంబరు కనీస ధర రూ.50 వేలుంటే.. ఆ నంబరుకోసం ఒక్కరే దరఖాస్తు చేస్తే అదే ధరకిచ్చేవారు. ఒకరికంటే ఎక్కువమంది పోటీపడినట్లయితే సీల్డ్ టెండర్లు ఆహ్వానించేవారు. పోటీలో ఎక్కువ మొత్తం చెల్లించేవారికి నంబరును కేటాయించేవారు. ఈ విధానంలో పరపతి ఉన్నవారు పోటీదారులతో రింగై తక్కువ మొత్తంలో ఫ్యాన్సీ నంబ రును దక్కించుకునేందుకు వీలుంది. దీంతో రవాణాశాఖ ఆదాయానికి గండి పడుతోంది. ఈ-టెండర్ విధానంలో ఇందుకు ఆస్కారం లేదు.
 
వాహన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
ఇదిలా ఉండగా వాహనాలు విక్రయించే డీలర్ వద్దే ఇకనుంచీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని రవాణాశాఖ యోచిస్తోంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసిన సమయంలో డీలర్ వద్ద ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరును కేటాయిస్తున్నారు. ఇకపై షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. కొనుగోలు సమయంలోనే వాహనదారు వివరాలు, ఇంజన్, ఛాసిస్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు.

యజమాని సంతకం, కంప్యూటర్ ప్యాడ్‌లో ఫీడ్ చేసి పూర్తి చేసిన వివరాలన్నీ రవాణా అధికారులు సేకరించి నేరుగా రిజిస్ట్రేషన్ కార్డును పోస్టులో పంపుతారు. వాహన ఫిట్‌నెస్, లెసైన్సు పరీక్షలు తప్ప ప్రభుత్వం నుంచి జరిపే ఏ కార్యకలాపాలకు రవాణాశాఖ కార్యాలయాలతో పనిలేకుండా అన్నీ ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు