డబ్బుల చేరవేతలో రమేష్దే కీలకపాత్ర

28 Jul, 2016 10:34 IST|Sakshi
డబ్బుల చేరవేతలో రమేష్దే కీలకపాత్ర

ఒంగోలు:  తెలంగాణ మెడికల్ ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంలో  రాజగోపాల్ రెడ్డితో పాటు కనిగిరికి చెందిన రమేష్ కూడా కీలక పాత్ర వహించినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. ఆర్మీలో పని చేసి పదవీ విరమణ చేసిన రమేష్ అనంతరం కోచింగ్ సెంటర్ల వద్ద దళారీగా వ్యవహరించేవాడు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూళ్లు, చేరవేతలో అతడు కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ఇలాంటి వ్యవహారాలే నడిపినట్లు తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంకు చెందిన రమేష్ ఇరవై ఏళ్ల క్రితమే స్వస్థలాన్ని వదిలి హైదరాబాద్ ఉప్పల్లో ఉంటున్నాడు.  ఇతడికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఒకరు డాక్టర్ కాగా, మరొకరు నేవీ ఉద్యోగి. కాగా ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు తొలుత కనిగిరికి చెందిన ఖాశింను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి, అనంతరం వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ఇతడు రమేష్ భార్య సోదరి కుమారుడు.

రమేష్కు చెందిన ఫోన్కాల్ లిస్ట్లో ఎక్కువసార్లు ఖాశిం నెంబర్ ఉండటంతో సీఐడీ అధికారులు అతని కదలికలపై నిఘా పెట్టారు. మరోవైపు రమేష్ తరచూ కనిగిరిలో బస చేసే కందుకూరు గ్రానైట్ వ్యాపారికి చెందిన కనిగిరి గెస్ట్ హౌస్ను కూడా సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రాజగోపాల్ రెడ్డి,రమేష్, తిరుమల్, విష్ణులను సీఐడీ అధికారులు రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఎంసెట్-2 పరీక్షపై ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది.

>
మరిన్ని వార్తలు