ఎంసెట్ కలవరం...

20 Jul, 2016 03:57 IST|Sakshi
ఎంసెట్ కలవరం...

- పేపరు లీక్ వదంతులతో తల్లిదండ్రుల్లో ఆందోళన
- విచారణకు సర్కార్ ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్/వరంగల్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 9న నిర్వహించిన ఎంసెట్-2 పేపరు లీక్ అయిందన్న వదంతులతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. తాజా గందరగోళ పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు. ఏపీ ఎంసెట్ 81 మార్కులు సాధించిన ఓ విద్యార్థికి తెలంగాణ ఎంసెట్-1లో 88 మార్కులు వచ్చాయి. అదే విద్యార్థికి ఎంసెట్-2లో 133 మార్కులు రావడంతో కొంతమంది తల్లిదండ్రుల్లో అనుమానాలు రేకెత్తా యి. మరో విద్యార్థి మొదటి.. రెండో ఎంసెట్ మార్కులకు మధ్య 30 మార్కుల తేడా ఉండటంపైనా సందేహాలొచ్చాయి.

అయితే, దీని ఆధారంగా పేపరు లీకయిందనడం అవాస్తవమని కొందరు కొట్టి పారేశారు. ఎంసెట్-1 పేపరుకు, ఎంసెట్-2 పరీక్షలకు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. పైగా మే 22న నిర్వహించిన ఎంసెట్-1 పరీక్ష ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు మినహాయించి నిర్వహించింది అయినందున... అప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్ కోసం సిద్ధమయ్యే విద్యార్థులు ఆ పరీక్షపై పెద్దగా శ్రద ్ధపెట్టకపోవచ్చంటున్నారు. ఎంసెట్-2 పూర్తిగా ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాల కోసమే నిర్వహించింది కనుక దీనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటారని వాదిస్తున్నారు. దీంతో మార్కుల్లో కచ్చితంగా తేడాలు వస్తాయంటున్నారు. మరోవైపు ఒక పరీక్ష పేపరు, మరో పరీక్ష పేపరు రూపకల్పనకు, వాటిల్లో ఇచ్చే ప్రశ్నలకు తేడాలుంటాయంటున్నారు.

 ఏదేమైనా ఆరోపణలు, అనుమానాలు వచ్చినందున వాటిని నివృత్తి చేసేందుకు ఉన్నత విద్యా మండలి ప్రాథమిక విచారణకు ఆదేశించింది. రెండు, మూడు రోజుల్లో అన్ని విషయాలు బయటపడతాయని ఉన్నత విద్యా మండలి వర్గాలు వెల్లడించాయి.

 జేఎన్‌టీయూహెచ్‌లో ధర్నా... ర్యాలీ
 ఇదిలావుంటే... పేపరు లీకేజీ వదంతుల నేపథ్యంలో మంగళవారం జేఎన్‌టీయూహెచ్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వర్సిటీలోని ఎంసెట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, విచారణను నిష్పక్షపాతంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో వర్సిటీలో ర్యాలీ చేపట్టారు. ఎంసెట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

 సీఐడీ విచారణ చేయాలి...
 పేపర్ లీక్ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పస్క నర్సయ్య  డిమాండ్ చేశారు.   
 
 ఆ వార్తలు అవాస్తవం
 ఎంసెట్-2 పేపరు లీక్ అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవం. నాకు తెలిసినంత వరకు పేపరు లీక్ అయ్యేందుకు ఆస్కారం లేదు.
     - ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
 
 విచారణ చేపడతాం
 ప్రశ్నపత్రం లీక్ అయిందన్నదాంట్లో వాస్తవం లేదు. ఆరోపణలు వచ్చినందున అత్యున్నత కమిటీచే విచారణ చేపడతాం. లీక్ నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటాం.
 - వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
 
 ప్రాథమిక విచారణకు ఆదేశం
 ఆరోపణలపై ప్రాథమిక విచారణకు ఆదేశించాం. ఏ దశలోనైనా పేపరు లీక్‌కు సంబంధించి ఆస్కారం ఉన్నట్లు తేలితే పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం.  
 - ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి
 
 వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి
 పేపరు లీక్ ఆరోపణలపై విచారణ జరుగుతోంది. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాం.    - ఎంసెట్-2 కన్వీనర్ ఎన్‌వీ రమణరావు

మరిన్ని వార్తలు