రేపటినుంచి ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు!

15 Jun, 2017 03:17 IST|Sakshi
రేపటినుంచి ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు!
- 15న రాత్రికి విద్యార్థులకు లాగిన్‌ ఐడీ
- 22 నాటికి పూర్తికానున్న వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ
- 28న సీట్లను కేటాయించే అవకాశం
- నేడు కాలేజీలు, సీట్ల వివరాలు అందుబాటులోకి..
- జేఎన్‌టీయూ నుంచి 75 వేలు.. మొత్తం 90 వేల వరకే సీట్లు?
 
సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 16 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఎంసెట్‌ ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నాటికి 26 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి కాగా, గురువారం 36 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి కానుంది. దీంతో ఈనెల 15న సాయంత్రం 7 గంటలకు ఆయా విద్యార్థుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లకు లాగిన్‌ ఐడీలను పంపించనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులు లాగిన్‌ ఐడీ ఉపయోగించి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు బుధవారం వరకు కూడా ఎన్ని కాలేజీలు, ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయన్న వివరాలు తేలలేదు. 16 నుంచి వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ఎట్టి పరిస్థితుల్లోనైనా వర్సిటీల నుంచి వివరాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

5 శాతం సీట్లు కలిగిన ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి కాలేజీల జాబితా ఇప్పటికే ఉన్నత విద్యా మండలికి అందింది. 95 శాతం సీట్లు కలిగిన జేఎన్‌టీయూహెచ్‌ నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కొన్ని కాలేజీలు, వాటిల్లోని సీట్లకు సంబంధించిన వివరాలు బుధవారం సాయంత్రం వరకు అందలేదని అధికారులు చెబుతున్నా.. మధ్యాహ్నానికే వివరాలను ఉన్నత విద్యా మండలికి అందజేసినట్లు తెలిసింది. మిగిలిన కాలేజీలు, సీట్ల వివరాలను బుధవారం అర్ధరాత్రిలోగా అందజేస్తామని జేఎన్‌టీయూ అధికారులు వెల్లడించినట్లు సమాచారం.
 
అనుబంధ గుర్తింపుపై చర్చ
కాలేజీల అనుబంధ గుర్తింపునకు సంబంధిం చిన అంశాలపై ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డితో ఓయూ వీసీ రామచంద్రం, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ యాదయ్య, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ బుధవారం సమావేశమై చర్చించారు. జేఎన్‌టీయూ నుంచి 180 వరకు కాలేజీల్లో 75 వేల వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీటికి తోడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లోని 11 వేల సీట్లు, ప్రభుత్వ కాలేజీల్లోని 3,030 సీట్లు కలుపుకొని మొత్తం 88 వేల వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
 
నేడు 26,001 నుంచి 36 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్‌
ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో భాగంగా ఈనెల 15న 26,001వ ర్యాంకు నుంచి 36 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. వీరికి హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో వెరిఫికేషన్‌ ఉంటుందని, ఎన్‌సీసీ కేటగిరీ వారికి మాత్రం (ఒకటో ర్యాంకు నుంచి 36 వేల ర్యాంకు వరకు) సాంకేతిక విద్యా భవన్‌లో వెరిఫికేషన్‌ ఉంటుందని తెలిపారు. 1వ ర్యాంకు నుంచి 16 వేల ర్యాంకు వరకు 10,279 మందికి వెరిఫికేషన్‌ నిర్వహించగా, బుధవారం 16,001 నుంచి 26 వేల ర్యాంకు వరకు విద్యార్థులు 7,031 మందికి వెరిఫికేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. మొత్తంగా బుధవారం నాటికి 26 వేల ర్యాంకు వరకు 17,310 మంది వెరిఫికేషన్‌ చేయించుకున్నట్లు వెల్లడించారు. 36 వేలలోపు ర్యాంకు విద్యార్థుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ ఫోన్లకు ఈనెల 15న రాత్రి 7 గంటలకు లాగిన్‌ ఐడీలను పంపిస్తామని, 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపారు.
 
వన్‌టైం పాస్‌వర్డ్‌తో..
ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకునేందుకు వన్‌టైం పాస్‌వర్డ్‌ విధానాన్ని ప్రవేశాల క్యాంపు కార్యాలయం అమల్లోకి తెచ్చింది. విద్యార్థుల పేర్లతో ఇతరులెవరూ ఆప్షన్లు ఇవ్వడానికి వీల్లేకుండా చర్యలు చేపట్టింది. విద్యార్థి సొంతంగా ఆప్షన్లు ఇచ్చేకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ వెల్లడించారు.
 
గణనీయంగా సీట్ల తగ్గింపు
గతేడాది 1.04 లక్షల సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అయితే ఈసారి అన్ని సీట్లకు ఇచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని సీట్లూ భర్తీ కావడం లేదని, అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్న నేపథ్యంలో ఈసారి గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి గురువారం ఇంజనీరింగ్‌ ప్రవేశాలు చేపట్టే కాలేజీలు, సీట్లు అందుబాటులోకి వస్తే శుక్రవారం నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునే వీలు ఏర్పడనుంది. 16, 17 తేదీల్లో ఒకటో ర్యాంకు నుంచి 36 వేల ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈనెల 22వ తేదీ నాటికి చివరి ర్యాంకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడంతోపాటు 22, 23 తేదీల్లో అప్షన్లలో మార్పులకు అవకాశం కల్పించి 28వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.
 
వెబ్‌ ఆప్షన్లు ఎలా ఇచ్చుకోవాలంటే..
విద్యార్థులు ఎంసెట్‌ వెబ్‌ సైట్‌లోకి వెళ్లి తమ మొబైల్‌కు వచ్చిన లాగిన్‌ ఐడీతో పాటు హాల్‌టికెట్‌ నంబర్, ర్యాంకు, పుట్టిన తేదీ ఎంటర్‌ చేసి వెబ్‌ పేజీలోకి వెళ్లాలి. పాస్‌వర్డ్‌ జెనరేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత లాగ్‌ అవుట్‌ కావాలి. లాగిన్‌ ఐడీ ఆ ఒక్కసారే పని చేస్తుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయంలో ఇచ్చిన రిసిప్ట్‌ ఆఫ్‌ సర్టిఫికెట్స్‌ ఫారంపై ఉండే నంబర్, హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ, ర్యాంకు, జెనరేట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌ వివరాలను ఎంటర్‌ చేసి పేజీలోకి వెళ్లాలి. అందులోకి వెళ్లగానే విద్యార్థుల రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వన్‌టైం పాస్‌వర్డ్‌ వస్తుంది. ఆ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాగానే వెబ్‌ ఆప్షన్ల పేజీ ఓపెన్‌ అవుతుంది. అప్పుడు విద్యార్థులు తమకు కావాల్సిన కాలేజీలు, బ్రాంచీలను ఎంపిక చేసుకోవాలి. 
మరిన్ని వార్తలు