రూ.లక్షన్నర కోట్లకు పైగా!

5 Sep, 2015 08:54 IST|Sakshi
రూ.లక్షన్నర కోట్లకు పైగా!

వచ్చే ఏడాది బడ్జెట్‌పై ముందస్తు కసరత్తు
రికార్డు స్థాయిలో పెంచే సంకేతాలు
ముందుగానే ఆరా తీసిన ముఖ్యమంత్రి
సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ.25 వేల కోట్లు
డబుల్ బెడ్రూం ఇళ్లు, వాటర్‌గ్రిడ్‌కు భారీ కేటాయింపులు

 
హైదరాబాద్: వచ్చే ఏడాది బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ లక్షన్నర కోట్లు దాటిపోనుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ ఏడాది ఎంత ఖర్చు చేస్తాం, వచ్చే ఏడాది ఎంత బడ్జెట్ ప్రవేశపెడదామని సీఎం ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న తెలంగాణ జల వినియోగ విధానంపై చర్చ జరుగుతున్న సమయంలో బడ్జెట్ కేటాయింపులపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. రాబోయే మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల చొప్పున సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినేట్ భేటీ అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దీంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఎంచుకున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్లు, గ్రామజ్యోతి, సంక్షేమ పథకాలన్నింటికీ భారీ మొత్తంలో నిధుల అవసరం ఉంది. ఈ ఏడాది డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలని ఇటీవలి కేబినేట్‌లోనే నిర్ణయం తీసుకున్నారు.

ఈ భారీ కేటాయింపులు, ఖర్చులకు అనుగుణంగా ఆర్థిక అవసరాలు, అంచనాలెలా ఉన్నాయని కేసీఆర్ ఆరా తీయడంతో పాటు బడ్జెట్ ప్రస్తావన లేవనెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరుసటి రోజున క్యాంపు కార్యాలయంలో తనను కలసి సమస్యలను విన్నవించేందుకు వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులతోనూ సీఎం ఆర్థిక పరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వచ్చే ఏడాది బడ్జెట్ రూ.1.58 లక్షల కోట్లకు చేరుతుందని.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. దీంతో వచ్చే బడ్జెట్ రికార్డు స్థాయి లో పెరిగిపోనుంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఏడాది పది నెలల కాలానికి రూ. లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం వరుసగా అదే పంథాను కొనసాగిస్తుండటం గమనార్హం. 2014-15లో రాష్ట్ర బడ్జెట్ రూ.1,00,637 కోట్లు. ఈ ఏడాది మార్చిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,689 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది.
 

>
మరిన్ని వార్తలు