రాత్రి 8.30-9.30.. స్విచ్‌ఆఫ్

19 Mar, 2016 02:53 IST|Sakshi

- పర్యావరణ పరిరక్షణకు నేడు ‘ఎర్త్ అవర్’
- ఈపీటీఆర్‌ఐ డెరైక్టర్ జనరల్ కల్యాణ చక్రవర్తి విజ్ఞప్తి
 
సాక్షి, హైదరాబాద్:
సమతుల్య వాతావరణం కోసం ప్రపంచవ్యాప్తంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవసరం లేని లైట్లను స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ పాటిస్తున్నారని... ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలంతా విజయవంతం చేయాలని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డెరైక్టర్ జనరల్ బి.కల్యాణ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు.

ఎర్త్ అవర్‌పై శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పారిస్ ప్రొటోకాల్ ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల రెండు శాతానికి మించకుండా ప్రతీ దేశంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగానే ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నామన్నారు. 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్‌ను ప్రతీ ఏడాది పాటిస్తున్నారని తెలిపారు. మన దేశంలో 150 పట్టణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కంపెనీలు, ఇండియాగేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, హౌరా బ్రిడ్జి వద్ద లైట్లను ఆర్పివేసి మద్దతు అందిస్తున్నారని ఆయన చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పవన, సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ పరిరక్షణకు కృషి చేస్తోందని చక్రవర్తి తెలిపారు. భూతాపంతో వివిధ జీవ జాతులు అంతరించిపోకుండా ఎర్త్ అవర్ కార్యక్రమానికి ‘వరల్డ్ వైడ్ ఫండ్’ సహకారం అందిస్తుందని... విద్యుత్ ఆదా, వనరుల పరిరక్షణ ద్వారా సమకూరే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర ైడె రెక్టర్ ఫరీదా తంపాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు