పట్ట భధ్రులు బల్దియా సారథులు

8 Feb, 2016 00:16 IST|Sakshi
పట్ట భధ్రులు బల్దియా సారథులు

బల్దియా పాలకమండలిలో ‘యువ’ నాయకత్వం
50 ఏళ్ల లోపువారు 129 మంది
నూతనంగా ఎన్నికైనవారిలో 58 మంది పట్టభద్రులు

 
‘విశ్వనగరానికి బాటలు వేసే విద్యావంతులే మాకు కావాలంటూ..’ గ్రేటర్ వాసులు విస్పష్టంగా వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విద్యావంతులకే ఎక్కువ శాతం మంది ఓటేశారు. తద్వారా ఉన్నత విద్య కలిగిన యువ నేతలు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. మొత్తం 150 మంది కార్పొరేటర్లలో 58 మంది పట్టభద్రులు, 15 మంది పీజీ పూర్తి చేసినవారు, పదుల సంఖ్యలో బీటెక్, ఎంటెక్, లా పూర్తి చేసిన వారు ఉండడం విశేషం. ఇక 40 ఏళ్ల లోపు వయసున్నవారు 69 మంది, 50 ఏళ్ల లోపు ఉన్న వారు 60 మంది ఉన్నారు. తద్వారా యువనేతలకు, విద్యావంతులకే ప్రజలు పట్టం కట్టారన్న విషయం స్పష్టమవుతోంది.
 
సిటీబ్యూరో: సిటీ ప్రజలు విద్యావంతులకే ఓటన్నారు. గ్రేటర్ పోరులో పట్టభద్రులకే పట్టంకట్టారు. మహానగరం.. విశ్వనగరం బాటలో దూసుకెళ్లాంటే కార్పొరేటర్లుగా ఉన్నత విద్యావంతులు ఉండాల్సిందేనంటూ వారినే కార్పొరేటర్లుగా గెలిపించారు. తాజాగా ఎన్నికైన కార్పొరేటర్ల విద్యార్హతలను పరిశీలిస్తే.. వీరిలో 58 మంది పట్టభద్రులు ఉండడం విశేషం. ఆకాశంలో సగం.. అవకాశాల్లో మాత్రం వెనుకంజే.. అన్న నానుడిని తోసిరాజని మొత్తం 150 డివిజన్లలో 75 మంది మహిళా అభ్యర్థులే గెలుపొందారు. అంతేకాదు గెలిచిన వారిలో డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అధికంగా ఉండడంతో ఈసారి బల్దియా పాలకమండలి ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఇక డిగ్రీల విషయానికి వస్తే ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, వైద్యం, బీఈడీ వంటి ఉన్నత వృత్తివిద్యా కోర్సులను పూర్తి చేసినవారు కూడా కార్పొరేటర్లుగా ఎన్నికవడంతో బల్దియా పాలకమండలి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంలా నిలవనుంది. విభిన్న కోర్సులు చదివిన వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడంతో ఆయా రంగాలలో గ్రేటర్ నగరం అభివృద్ధికి వారంతా విలువైన సలహాలు, సూచనలు అందించి అత్యున్నత ప్రమాణాలున్న సరికొత్త విధానాలను రూపొందించే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు.
 
యువ నాయకత్వానికే ఓటు..
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల వయసును బట్టి చూస్తే యువతే అధికంగా ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించే సమర్థత, సత్తా ఉన్నవారు యువతేనని ఓటర్లు స్పష్టం చేశారు. ఓటు అనే వజ్రాయుధాన్ని యువతే అందించారు. గెలిచిన 150 మందిలో కార్పొరేటర్లలో 40 ఏళ్లలోపు వయసున్న వారు ఏకంగా 69 మంది ఉండడం విశేషం. 40 నుంచి 50 ఏళ్ల లోపున్న వారు 60 మంది ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వారు కేవలం ఇద్దరే ఉండడం గమనార్హం.
 
విద్యా ప్రమాణాలకే మద్దతు..

కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లలో డిగ్రీ పూర్తిచేసిన వారు 58 మంది ఉన్నారు. ఇక పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినవారు 15 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు 24 మంది ఉండగా.. పదోతరగతి, సెకండరీ విద్యాభ్యాసం పూర్తి చేసినవారు 52 మంది ఉన్నారు. మరొకరు వైద్య విద్యనభ్యసించారు. ఇక లా, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు  చదివినవారూ ఉన్నారు. వీరిలో కొందరు గూగుల్ వంటి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసినవారు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన పి. విజయారెడ్డి ఎంటెక్ పూర్తిచేశారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి లా చదివారు. ఓల్డ్ మలక్‌పేట్ కార్పొరేటర్ జువేనా ఫాతిమా ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంబీఏ చేసిన సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమ గూగుల్‌లో ఉద్యోగం మానేసి ప్రజాసేవలో అడుగుపెట్టడం విశేషం.
 
యువ హోరు.. జోరు..
మహానగర పాలన సంస్థ పరిపాలన,ప్రజా సేవలందించే పాలకమండలిలో ఈసారి యువహోరు..జోరు కనిపిస్తోంది. మొత్తం 150 మంది కార్పొరేటర్లలో 40 ఏళ్ల వయస్సు లోపలున్నవారు 69 మంది ఉండడం విశేషం. విశ్వనగరం దిశగా మహానగరాన్ని తీసుకెళ్లే దక్షత, సామర్థ్యం, జవాబుదారీతనం యువతకే అధికంగా ఉంటాయని,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేందుకు టెక్‌గురు అవతారం ఎత్తడం యువతకే సాధ్యమని,ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే శక్తి వారికే ఉంటుందని భావించిన గ్రేటర్ ఓటర్లు పలువురు యువతీ, యువకులనుకార్పొరేటర్లుగా గెలిపించి తమ విజ్ఞతను చాటుకున్నారు. ఇక తాజాగా ఎన్నికైన కార్పొరేటర్లలో 40 నుంచి 50 ఏళ్ల మధ్యనున్నవారు 60 మంది ఉండడం విశేషం. గెలిచిన కార్పొరేటర్లలో 50 నుంచి 60 ఏళ్లలోపున్న వారు 19 మంది,అరవై ఏళ్లు దాటిన వారు ఇద్దరే ఉండడం విశేషం.
 
సీమాంధ్రులూ భారీగానే..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర మూలాలున్న అభ్యర్థులు కార్పొరేటర్లుగా భారీగానే విజయం సాధించారు. ఇందులో అత్యధికంగా టీఆర్‌ఎస్ నుంచే ఎన్నికయ్యారు. కాజా సూర్యనారాయణ (జూబ్లిహిల్స్), ఎ. విజయలక్ష్మి (సోమాజిగూడ), శేషుకుమారి (అమీర్‌పేట) కిలారి మనోహర్ (వెంగళరావు నగర్), మేకా రమేష్ (మియాపూర్), జానకి రామరాజు (హైదర్‌నగర్), విజయకుమారి (అడ్డగుట్ట) కె.శ్రీదేవి (నేరేడ్‌మెట్), టీడీపీ తరపున మందాడి శ్రీనివాసరావు (కేపీహెచ్‌బీ) తదితరులు ఉన్నారు. ఇక తమిళ మూలాలున్న సర్వరాజ్ శివమణి (కాప్రా) విజయం సాధించారు.
 

మరిన్ని వార్తలు