ఎల్‌నినో ఎల్లిపాయె.. లానినా రాకపాయె!

16 Jun, 2016 01:42 IST|Sakshi
ఎల్‌నినో ఎల్లిపాయె.. లానినా రాకపాయె!
  • తటస్థ స్థితిలో వాతావరణం
  • ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే రుతుపవనాలకు ఊపు: శాస్త్రవేత్తలు
  •  

     సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఎండలతో హోరెత్తించిన ఎల్‌నినో కనుమరుగైంది. వాన లతో ముంచెత్తాల్సిన లానినా రాకకు మాత్రం ఇంకాస్త సమయం పడుతుందంటున్నారు వాతావరణ నిపుణులు! ప్రస్తుతం లానినా దశలోకి వెళ్లడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎల్‌నినో కానీ లానినా కానీ లేదని...  తటస్థ స్థితి మాత్రమే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే లానినా రావాల్సి ఉన్నా.. తటస్థ స్థితి నుంచి నెల రోజుల్లో లానినా ఏర్పడుతుందని తెలిపింది. రుతుపవనాలపై ఎల్‌నినో, లానినాల ప్రభావం ఉంటుంది. రుతుపవనాలు వచ్చాక అవి వేగంగా ముందుకు కదలడానికి, వర్షాలు కురవడానికి లానినా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లానినా ఏర్పడ్డాక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. జూలై, ఆగస్టు నాటికి లానినా 26% నుంచి 52%నికి చేరుకోనుంది. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67%నికి, అక్టోబర్ చివరకు 71%నికి చేరుకోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

     

    ఆవర్తనం లేకే ఆలస్యం..

    నైరుతి రుతుపవనాలు కేరళను తాకి వారం రోజులు కావస్తున్నా ఇంకా తెలంగాణలోకి ప్రవేశించలేదు. ఈ నెల 15 నాటికే రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఏపీని రుతుపవనాలు తాకినా బలహీనపడడంతో అక్కడ కూడా వర్షాలు కురవడం లేదు. కేరళ, కర్ణాటకలోని కోస్తా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాల కారణంగా విసృ్తతంగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఊపందుకోలేదు. ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే తప్ప రుతుపవనాలు రావని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 17-18 తేదీల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఫలితంగా నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

     
    మరో 4 రోజులు వర్షాలు
    మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం రామగుండంలో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 40.3, హన్మకొండ 39.7, నల్లగొండ 39.4, నిజామాబాద్ 39.3, ఖమ్మం 39.2, భద్రాచలంలో 39.0, హైదరాబాద్ 37.3, మెదక్ 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు