స్టూడెంట్ బస్ పాస్ జారీకి విస్తృత ఏర్పాట్లు

5 Jun, 2016 01:40 IST|Sakshi
స్టూడెంట్ బస్ పాస్ జారీకి విస్తృత ఏర్పాట్లు

ఈనెల 10 నుంచి 19 కేంద్రాల ద్వారా పంపిణీ
రద్దీ నియంత్రణకు ఆన్‌లైన్ సేవలు
సెలవులు, ఆదివారాల్లో కూడా పాస్‌లు
ఆర్టీసీ గ్రేటర్ ఈడీ పురుషోత్తం వెల్లడి

 సాక్షి,సిటీబ్యూరో: స్కూళ్లు, కళాశాలలు తిరిగి తెరుచుకోనున్న దృష్ట్యా విద్యార్ధుల బస్‌పాస్‌ల జారీకీ  ఆర్టీసీ విస్తృత  ఏర్పాట్లు చేపట్టింది.నగరంలోని 19 ప్రధాన బస్‌పాస్ కేంద్రాల ద్వారా  ఆఫ్‌లైన్ పద్ధతిలో  ఉచిత బస్‌పాస్‌లు, రూట్ పాస్‌లు అందజేస్తారు. మరో 53 ఆన్‌లైన్ కేంద్రాల  ద్వారా  బస్‌పాస్‌ల రెన్యూవల్స్‌తో పాటు, వివిధ రకాల  పాస్‌లను  అందజేసేందుకు  అధికారులు  చర్యలు చేపట్టారు. ఈ నెల 13 నుంచి  విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  10వ తేదీ నుంచే  బస్‌పాస్‌లను అందజేయనున్నట్లు  ఆర్టీసీ  గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్  డెరైక్టర్ పురుషోత్తమ్  శనివారం  విలేకరుల సమావేశంలో  వెల్లడించారు.

బస్‌పాస్ కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఈ ఏడాది మొట్టమొదటి సారి లక్షా  50 వేల స్టూడెంట్ జనరల్ టిక్కెట్‌లకు (జీబీటీ) కేవలం  ఆన్‌లైన్‌లోనే  దరఖాస్తుల స్వీకరిస్తారు.  జీబీటీ పాస్‌లు కావాలనుకొనే విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే  దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారం లోపు  వారికి  బస్‌పాస్‌లను అందజేస్తారు. కొరియర్ లేదా  పోస్టల్ సర్వీస్  ద్వారా  జీబీటీలను  పంపిణీ చేయాలని భావించినప్పటికీ  చార్జీల భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి విద్యార్థులకు బస్‌పాస్ కేంద్రాల ద్వారా నేరుగా అందజేయాలని నిర్ణయించినట్లు ఈడీ చెప్పారు. 50 వేలకు పైగా ఉన్న ఉచిత పాస్‌లు, మరో 1.5 లక్షల రూట్ పాస్‌లు, ఇతర పాస్‌లను ఈ ఏడాది నేరుగానే అందజేస్తారు. ప్రస్తుతం 50 శాతం పాస్‌లకు మాత్రమే ఆన్‌లైన్ సేవలను  ప్రవేశపెట్టాం. దశలవారీగా మొత్తం పాస్‌లను ఆన్‌లైన్ పరిధిలోకి  తెస్తాం.’’ అని  ఈడీ  పేర్కొన్నారు.

 19 కేంద్రాల్లో  పాస్‌లు...

రెతిఫైల్, ఓల్డ్ సీబీఎస్, సనత్‌నగర్, మెహదీపట్నం, చార్మినార్, ఆఫ్జల్‌గంజ్, ఉప్పల్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, దిల్‌సుఖ్‌నగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చెల్, కాచిగూడ, కూకట్‌పల్లి బస్‌స్టేషన్, షాపూర్‌నగర్, బీహెచ్‌ఈఎల్ కీర్తిమహల్, వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ, హయత్‌నగర్, శంషాబాద్, మిధానీ కేంద్రాల్లో ఉచిత, రూట్ పాస్‌లను అందజేస్తారు.

ఈ పాస్‌ల కోసం విద్యార్ధులు ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు, ఐడీ, బోనఫైడ్, ఫీజు రశీదు, ఎస్సెస్సీ మెమో,తదితర ధృవపత్రాల జిరాక్స్ ప్రతులను జతపరిచి అందజేయాలి. దరఖాస్తు చేసుకున్న వారం లోపు  బస్‌పాస్‌లు ఇస్తారు.

స్టూడెంట్ జనరల్ , గ్రేటర్, ఎక్స్‌క్లూజివ్, స్పెషల్ బస్‌పాస్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫొటో మాత్రం అప్‌లోడ్ చేస్తే చాలు.మిగతా డాక్యుమెంట్స్ పాస్ తీసుకొనే సమయంలో అధికారులకు అందజేయవచ్చు.ఆన్‌లైన్ దరఖాస్తులు  www.tsrtcpass.in (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్‌ఆర్టీసీ డాట్ ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

 సెలవు  రోజుల్లో కూడా...
సాధారణ రోజుల్లో ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి  రాత్రి 8 గంటల వరకు బస్‌పాస్‌లను అందజేస్తారు. విద్యార్ధుల రద్దీని దృష్టిలో ఉంచుకొని  ఈ  ఏడాది  ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో కూడా  ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పాస్‌లు  అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు.

 ఉచిత పాస్‌ల  కోసం  విద్యార్ధులు  ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవ సరం లేకుండా ఈ సారి  ఆర్టీసీ డిపోమేనేజర్లు  తమ పరిధిలోని  స్కూళ్లకు వెళ్లి  ఉచిత పాస్‌ల దరఖాస్తులను స్వీకరించే విధంగా గ్రేటర్ ఆర్టీసీ  చర్యలు చేపట్టింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం  పిల్లల తల్లిదండ్రులు  బస్‌పాస్ కేంద్రాలకు వెళ్లి పాస్‌లు  తీసుకోవచ్చు.

విద్యార్ధుల బస్‌పాస్‌లకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు,సలహాల కోసం నేరుగా ఫోన్ చేయవచ్చు. 8008204216 నెంబర్‌కు సంప్రదించవచ్చు. ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు atmbuspass@gmail.ఛిౌఝ  కు మెయిల్స్ చేయవచ్చు.

మరిన్ని వార్తలు