ఫిబ్రవరిలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

2 Oct, 2016 02:06 IST|Sakshi

3 గ్రాడ్యుయేట్స్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు..

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు గ్రాడ్యుయేట్ శాసన మండలి నియోజకవర్గాలకు, రెండు ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి తొలివారంలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి నెలాఖరుకు ఈ ఐదు నియోజకవర్గాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు కావాలంటే నవంబర్ 1వ తేదీకి ముందు పట్టభద్రులైనవారు అర్హులు.

ఉపాధ్యాయులైతే నవంబర్ 1కి ముందు.. గడిచిన ఆరేళ్లలోపు సెకండరీ స్కూలు కన్నా తక్కువకానీ తరగతులలో రాష్ట్రంలోని ఏవేని విద్యాసంస్థల్లో బోధనలో కనీసం మూడేళ్ల మొత్తం వ్యవధికి నియోగించబడినవారు అర్హులు. అర్హతగలవారు శనివారం నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు ఈ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ముసాయిదా ఓటర్ల జాబితాను వచ్చే నెల 23న ప్రకటిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను డిసెంబర్ 8వ తేదీలోగా స్వీకరిస్తారు. ఓటర్ల తుది జాబితాను డిసెంబర్ 30న ప్రచురిస్తారు.

మరిన్ని వార్తలు