పేలనున్న విద్యుత్ బాంబు!

9 Mar, 2016 03:45 IST|Sakshi
పేలనున్న విద్యుత్ బాంబు!

మధ్యతరగతి, పరిశ్రమలు, వాణిజ్యానికి షాక్
► రూ.1,958 కోట్ల మేర చార్జీల పెంపునకు డిస్కంల ప్రతిపాదన
► గృహ వినియోగం 100 యూనిట్లు దాటితే గుండె గు‘బిల్లు’!
► ఒక్కో యూనిట్‌పై 65 పైసల నుంచి రూపాయి వరకు పెంపు
► పరిశ్రమలపై 6-7.5 శాతం, వాణిజ్య కేటగిరీపై 10 శాతం వరకు మోత
► టౌన్‌షిప్‌లు, విమానాశ్రయాలు, నీటి పథకాలు, వీధి దీపాలపై సైతం బాదుడు
► పరిశ్రమలకు ‘టీవోడీ’ పెనాల్టీ సమయం 4 నుంచి 8 గంటలకు పెంపు
► హెయిర్ సెలూన్లకు రాయితీ కోసం ప్రత్యేక కేటగిరీగా గుర్తింపు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వినియోగదారులపై విద్యుత్ బాంబు పేలింది. మధ్య తరగతి నుంచి పరిశ్రమల దాకా చార్జీల మోత మోగిపోనుంది. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే పేదలపై మాత్రమే ప్రభుత్వం కాస్త కరుణ చూపింది. మిగతా వర్గాలపై మాత్రం భారీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. ఈ చార్జీల పెంపుతో ఏకంగా రూ.1,958 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గృహ వినియోగం 100 యూనిట్లు దాటితే... ప్రతి యూనిట్‌పై అదనంగా 65 పైసల నుంచి రూపాయి వరకు చార్జీల మోత మోగనుంది. ఎల్‌టీ కేటగిరీలోని పరిశ్రమలపై 6 శాతం... వాణిజ్య, వీధి దీపాలు, సాధారణ వినియోగంపై 10 శాతం... హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమలపై 7.5 శాతం... వాణిజ్య, తాగునీటి పథకాలు, టౌన్‌షిప్‌లు, విమానాశ్రయాలపై 10 శాతం దాకా అదనంగా విద్యుత్ చార్జీల భారం పడనుంది.
 
 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు.. ఆ తర్వాత గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపునకు సిద్ధమైంది. 100 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగంపై చార్జీలు యథాతథంగా ఉండనున్నాయి. 100 యూనిట్లు దాటితే మాత్రం గుండె గు‘బిల్లు’మనడం ఖాయం కానుంది.

వ్యవసాయం మినహాయిస్తే గృహ, పరిశ్రమలు, వాణిజ్య తదితర కేటగిరీలు కలిపి రూ.1,958 కోట్ల చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించాయి. ఈ మేరకు కొత్త టారిఫ్ ప్రతిపాదనలతో ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంలు 2016-17కు సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)లను మంగళవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)కి సమర్పించాయి. ఈఆర్సీ కార్యదర్శి కె.శ్రీనివాస్‌రెడ్డితో కలసి డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, కె.వెంకటనారాయణ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి ప్రతిపాదిత చార్జీల ప్రభావంపై క్లుప్తంగా వివరించారు. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ అనంతరం ఈఆర్సీ నూతన టారిఫ్‌ను ఖరారు చేయనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.
 
లోటు పూడ్చుకునేందుకు..

 విద్యుత్ సరఫరా కోసం ప్రస్తుతం సగటున యూనిట్‌కు రూ.6.44 ఖర్చవుతుండగా... ప్రస్తుత చార్జీలతో సగటున యూనిట్‌కు రూ.4.56 మాత్రమే ఆదాయం వస్తోంది. ఒక్కో యూనిట్‌పై రూ.1.88 ఆదాయ లోటును డిస్కంలు ఎదుర్కొంటున్నాయి. ఈ లెక్కన 2016-17లో డిస్కంల ఆదాయ అవసరాలు రూ.30,207 కోట్లు ఉండనుండగా... ప్రస్తుత టారిఫ్ ప్రకారం రూ.21,418 కోట్ల ఆదాయం మాత్రమే రానుంది. అంటే రూ.8,789 కోట్ల లోటు ఉంటుందని అంచనా. ఇందులో చార్జీల పెంపు ద్వారా రూ.1,958 కోట్లు సమకూర్చుకుంటామని డిస్కంలు ప్రతిపాదించాయి. మిగతా రూ.6,831 కోట్ల లోటు పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీ లే దిక్కుకానున్నాయి. 2015-16లో రూ.4,700 కోట్లు సబ్సిడీగా ప్రకటించిన ప్రభుత్వం... ఈసారి సబ్సిడీ నిధులను భారీగా పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.

 పెరుగుతున్న డిమాండ్
 నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు వ్యవసాయానికి విద్యుత్‌ను 6 గంటల నుంచి 9 గంటలకు పెంచనుండడం, ఎత్తిపోతల పథకాలు, హైదరాబాద్ మెట్రో రైలు, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ 11.42 శాతం పెరగనుంది. దీంతో మొత్తంగా వార్షిక విద్యుత్ డిమాండ్ 54,884 మిలియన్ యూనిట్లకు చేరనుంది. ఇవి కూడా చార్జీల పెంపునకు దోహదపడనున్నాయి.


 వీరిపై భారం తప్పింది..
 - రాష్ట్రంలో 119.6 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా 80.9 లక్షల (68 శాతం) కనెక్షన్లపై చార్జీల పెంపు భారం ఉండడం లేదు. 86 లక్షల గృహ వినియోగదారుల్లో 60.1 లక్షల మంది (70 శాతం)పై భారం ఉండదు. 20.7 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, 8,681 కుటీర పరిశ్రమలకు ఎలాంటి పెంపు లేదు.
 - ఎల్‌టీ కేటగిరీలోని అన్నిరకాల వినియోగదారులపై స్థిరచార్జీలు యథాతథంగా ఉండనున్నాయి.
 - హెచ్‌టీ కేటగిరీలోని ఫెర్రో అల్లాయ్స్ వినియోగదారులకు మినహాయింపు ఇచ్చారు.


 పరిశ్రమలకు డబుల్ పెనాల్టీ
 పరిశ్రమలపై ‘టైమ్ ఆఫ్ డే(టీవోడీ)’ జరిమానాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం సాయంత్రం 6-10 గంటల వరకు విద్యుత్ వినియోగంపై ఈ జరిమానా విధిస్తుండగా... ఇకపై ఉదయం 6-10 గంటల వరకు వినియోగంపైన కూడా యూనిట్‌కు రూపాయి చొప్పున పెనాల్టీ విధిస్తారు. దీనితో పరిశ్రమలపై అదనంగా మరో 3 శాతం వరకు చార్జీల భారం పడనుంది. ప్రధానంగా నిరంతరంగా విద్యుత్ వినియోగించుకునే స్టీలు, సిమెంట్, ప్లాస్టిక్, ఫోర్జ్ తదితర పరిశ్రమలపై ప్రభావం పడుతుంది. సగటున పరిశ్రమలపై 10-13 శాతం పెంపు ఉండనుంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుండడంతో అనేక పరిశ్రమలు డిస్కంల నుంచి కాకుండా ఓపెన్ యాక్సెస్ విధానంలో నేరుగా కొనుగోలు చేసుకుంటున్నాయి. టీవోడీ వేళల మార్పుతో మరిన్ని పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ బాట పట్టే అవకాశముంది. అయితే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పరిశ్రమలు విద్యుత్ వినియోగిస్తే ప్రతి యూనిట్ విద్యుత్‌పై 55 పైసల రాయితీని డిస్కంలు ప్రకటించాయి.

 - హెయిర్ కటింగ్ సెలున్లకు ప్రభుత్వం విద్యుత్ రాయితీని ప్రకటించిన నేపథ్యంలో ఆ వినియోగదారుల కోసం డిస్కంలు కొత్త కేటగిరీని సృష్టించాయి.
 వినియోగం (యూనిట్లలో)    చార్జీలు (రూ.లలో)
 0-50                                 5.26
 51-100                             6.48
 101-200                           7.46

 
 
 ఆరు గంటలకు రూ.4,700 కోట్ల రాయితీ.. తొమ్మిది గంటలకు ఎంత?
 

 నాలుగు శ్లాబులకు గృహ కేటగిరీ కుదింపు
 ప్రస్తుతం గృహ వినియోగ కేటగిరీలో 14 శ్లాబులు ఉండగా కేవలం 4 శ్లాబులకు కుదించారు.

 ప్రస్తుత, కుదించిన శ్లాబుల్లో ప్రతిపాదిత టారిఫ్, ప్రస్తుత టారిఫ్
 (వినియోగం యూనిట్లలో, చార్జీలు రూ.లలో)
 శ్లాబ్    వినియోగం        ప్రస్తుత చార్జీలు    ప్రతిపాదిత చార్జీలు

 1        0-50                   1.45              1.45

 2        51-100    
           0-50                   1.45               1.45
           50-100               2.60               2.60
 
3       101-200
             0-100               2.60               3.25
         101-200               3.60               4.25
 
4        200కు పైన
         0-200                  4.10                4.80
         201-400              7.43                8.15
         400కు పైన            8.50                9.50  

>
మరిన్ని వార్తలు