విద్యుత్ ఉద్యోగుల విభజన మళ్లీ మొదటికి!

28 Jan, 2016 04:52 IST|Sakshi
విద్యుత్ ఉద్యోగుల విభజన మళ్లీ మొదటికి!

♦ ఎవరి వాదన వారిదే
♦ రిలీవ్ ఉద్యోగులపై దిగిరాని తెలంగాణ
♦ చర్చలపై ఉద్యోగుల అసంతృప్తి
 
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కన్పించలేదు. ఇరు పక్షాలూ వారి వాదనలకే కట్టుబడ్డారు. దీంతో ఏ విధమైన పరిష్కారం లేకుండా ఈ నెల 30వ తేదీకి వాయిదా పడ్డాయి. జనాభా ప్రాతిపదికన విద్యుత్ ఉద్యోగుల విభజన జరగాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులు పట్టుపట్టారు. స్థానికతే కొలమానంగా తాము పొందుపర్చిన మార్గదర్శకాల ఆధారంగానే ముందుకెళ్లాలని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. అలాంటప్పుడు చర్చల ప్రక్రియ ఎందుకని ఏపీ అధికారులు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎనిమిది నెలల క్రితం 1252 మందిని రిలీవ్ చేశారు. ఈ అంశంపై అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగినట్టు తెలిసింది. విభజన చట్టంలో జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 42 శాతం, ఆంధ్రకు 58 శాతం ఉద్యోగులను కేటాయించాల్సి ఉందని ఏపీ అధికారులు గుర్తుచేశారు. దీనికి విరుద్ధంగా రిలీవ్ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 తెలంగాణ అధికారుల విముఖత..
 ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల దాదాపు 400 మంది ఉద్యోగులను తిరిగి ఇచ్చేస్తామని, అంత మొత్తాన్ని తెలంగాణలో ఉన్న ఏపీ స్థానికత ఉద్యోగులను తీసుకుంటామని, మిగతా ఉద్యోగుల విషయంలో జనాభా ప్రాతిపదికన వెళ్దామని ఏపీ అధికారులు సూచించారు. దీనికి తెలంగాణ అధికారులు ఎంతమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. భార్య లేదా భర్త తెలంగాణ ప్రాంతానికి చెంది ఉంటే వారికి మాత్రమే తమ సంస్థల్లో చోటు కల్పిస్తామని, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లివర్, కిడ్నీ, మానసిక వికలాంగత్వం ఉంటే సానుభూతి కోణంలో వారికి ఆప్షన్ ఇస్తామని తెలంగాణ అధికారులు తెలిపారు.

ఇలాంటి కేసులు 50 లోపే ఉంటాయని, దీనివల్ల సమస్య పరిష్కారం కాదని ఏపీ అధికారులు తెలిపారు. తెలంగాణ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని, పరిష్కారం దిశగా చర్చల్లో పాల్గొనడం లేదని వారు ఆరోపించారు. చర్చలు జరుగుతున్న తీరుపై రిలీవ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా తెలంగాణ చర్చలకు పిలవడం, స్పష్టమైన విధానాలు లేకుండానే ఏపీ అధికారులు వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు