‘విద్యుత్’ నిర్ణయాలతో పెనుభారం

18 Mar, 2016 03:41 IST|Sakshi
‘విద్యుత్’ నిర్ణయాలతో పెనుభారం

అసెంబ్లీలో సీఎల్పీ నేత జానారెడ్డి ఆందోళన
 

హైదరాబాద్: విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలకు పెనుభారంగా మారనున్నాయని విపక్ష నేత జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం, జెన్‌కో కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు కొనుగోళ్లు కొనసాగించడం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, సౌర విద్యుత్ ఒప్పందాలపై న్యాయ నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎండగట్టారు. ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 మెగావాట్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని ‘సూపర్ క్రిటికల్’కు బదులు ‘సబ్ క్రిటికల్ బాయిలర్’ పరిజ్ఞానంతో నిర్మిస్తుండడంతో ఏటా రూ.400 కోట్ల చొప్పున 25 ఏళ్ల ప్రాజెక్టు జీవితకాలంలో రూ.7,500 కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల నష్టం వస్తుందన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం.. ఆ విద్యుత్ ధర ఎంతో చెప్పాలన్నారు. కారిడార్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాదిన  రూ.4.25-4.50కు యూనిట్ చొప్పున విద్యుత్ లభిస్తుందని, అధిక ధర చెల్లించి ఛత్తీస్ విద్యుత్ కొనాల్సిన అవసరం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.5.25 నుంచి రూ.5.50 ఉంటుందని పత్రికల్లో కథనాలొచ్చాయన్నారు. రూ.4.25కే యూనిట్ సౌర విద్యుత్ ఇస్తామని ఆఫర్లు వస్తున్నా ..రూ.5.50-5.70 ధరతో 2,500 మెగావాట్ల కొనుగోళ్లకు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని నిలదీశారు.
 
జెన్‌కోలో తగ్గించి  ప్రైవేటులో కొంటారా?
జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లో బ్యాక్‌డౌన్ ద్వారా ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు కొనసాగిస్తుండడంతో రాష్ట్ర ప్రజలపై రూ.350 కోట్ల అదనపు భారం పడిందని జానారెడ్డి ఆరోపించారు. విద్యుత్ డిమాండ్ తగ్గిన సందర్భాల్లో యూనిట్‌కు రూ.3.80 మాత్రమే ధర గల జెన్‌కో విద్యుత్ కాదని రూ.6 చెల్లించి ప్రైవేటు విద్యుత్ కొంటున్నారని ఆరోపించారు. యూనిట్‌కు రూ.1.20 నష్టపరిహారంగా చెల్లించి ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోవడం ఉత్తమమన్నారు. ప్రైవేటుకు రూ.1.20 పెనాల్టీ చెల్లించి జెన్‌కో నుంచి కొనుగోళ్లను కొనసాగించినా మొత్తం విద్యుత్ వ్యయం యూనిట్‌కు రూ.5కు మించదని పేర్కొన్నారు. జెన్‌కో విద్యుత్‌ను వదులుకున్నా యూనిట్‌పై రూ.2 స్థిర చార్జీలను చెల్లిస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు రద్దు చేసుకున్న ప్రైవేటు విద్యుత్ కంపెనీలతోనే తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. ఏపీ ధరలతో పోల్చితే తెలంగాణ ధరాలు ఎక్కువున్నాయా తక్కువున్నాయా అని ప్రశ్నించారు. భూపాలపల్లిలో 500 మెగావాట్లు, సింగరేణిలో 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పనులను కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించినట్లు తెలిపారు.
 
డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ తదితర ప్రభుత్వ హామీల అమలులో జాప్యాన్ని విమర్శిస్తూ జానారెడ్డి అసెంబ్లీలో ఇలా పద్యం చదివారు... గృహ నిర్మాణం గుహలోకి..  గ్రామజ్యోతిలో నూనె లేదు.. 12 శాతం రిజర్వేషన్ రిజర్వులో పడింది. 3 ఎకరాలు మూలకుపడ్డాయి.. పరిశ్రమల పునరుద్ధరణ పునశ్చరణ లేదు.
 

మరిన్ని వార్తలు