‘విద్యుత్ ఉద్యోగుల’పై చర్చా మార్గం

20 Jan, 2016 03:30 IST|Sakshi
‘విద్యుత్ ఉద్యోగుల’పై చర్చా మార్గం

ఏపీకి పంపినవారిపై కోర్టు బయట పరిష్కారానికి  తెలంగాణ, ఏపీ సిద్ధం
►  వివాద పరిష్కారంపై చొరవ చూపిన టీ ట్రాన్స్‌కో సీఎండీ
►  అవసరమైతే కొంత మందిని వెనక్కి తీసుకునే యోచన?

 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కొంత మెత్తబడింది. ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేసిన 1,252 మంది ఉద్యోగుల్లో అవసరమైతే కొంత మందిని శాశ్వత ప్రాతిపదికన వెనక్కి తీసుకుని... ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. చర్చల ద్వారా న్యాయస్థానం వెలుపలే ఈ వివాదానికి ముగింపు పలికి, ఏపీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది.
 
  దీనిపై ఏపీ సర్కారు కూడా సానుకూలంగా స్పందించింది. ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల సీఎండీలు సమావేశమై చర్చల ద్వారా ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించుకుందామని తాజాగా టీ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రతిపాదించగా... దానికి ఏపీ ట్రాన్స్‌కో ఎండీ కె.విజయానంద్ సమ్మతించారు. ఈ నెల 22న హైదరాబాద్‌లోని ‘విద్యుత్ సౌధ’లో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల సీఎండీలు, హెచ్‌ఆర్ విభాగం డెరైక్టర్లు సమావేశమై చర్చలు జరపాలని ఇరుపక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయి.
 
 శాశ్వత పరిష్కారం కోసం..
 పుట్టినచోటు ఆధారంగా స్థానికతను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ ఉద్యోగుల విభజన జరిపేందుకు గతేడాది జూన్ 6న తెలంగాణ ఇంధన శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలోనే 1,252 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి పంపుతూ రిలీవ్ చేశాయి. ఆ ఉద్యోగులను తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల ఆధారంగానే విద్యుత్ ఉద్యోగుల విభజన జరపాలని వాదించింది.
 
  ఇక తెలంగాణ సర్కారు నిర్ణయంపై రిలీవైన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రిలీవైన ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు మూడు నెలల కింద తాత్కాలికంగా విధుల్లో తీసుకున్నాయి. కోర్టు సూచనల మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 52:48 నిష్పత్తిలో ఈ ఉద్యోగులకు జీతభత్యాలను చెల్లిస్తున్నాయి.
 
  తాజాగా ఈ వివాదాన్ని వేగంగా పరిష్కరించేందుకు ఈ నెల 20 నుంచి రోజువారీగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఇటీవలే హైకోర్టును ఆదేశించింది. దీంతో బుధవారం నుంచి హైకోర్టులో రోజువారీగా విచారణ జరగనున్న నేపథ్యంలో... చర్చల ద్వారా కోర్టు వెలుపలే వివాదానికి ముగింపు పలుకుదామని ఇరు రాష్ట్రాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి.
 
 పెద్దగా తేడా ఉండదంటున్న టీ-సంస్థలు
 ఏపీ డిమాండ్‌కు అనుగుణంగా కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగుల తుది విభజన జరిపినా... ఇప్పటికే ఏపీకి పంపిన ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం ఉండదని తెలంగాణ విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. కమల్‌నాథన్ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజనపై లెక్కలు సైతం వేసి చూశాయి. ఆ ప్రకారం చూసినా రిలీవైన 1,252 మంది ఉద్యోగుల్లో 100-200 మంది మాత్రమే తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. వారిని వెనక్కి తీసుకోడానికి ఒప్పుకున్నా పెద్దగా నష్టం లేదని... ఏపీలో పనిచేస్తున్న 450 మంది తెలంగాణ ఉద్యోగులు సైతం రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు