రేషన్.. ‘వేలిముద్రల’ పరేషాన్

14 Apr, 2016 02:03 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో:  గ్రేటర్ హైదరాబాద్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ (ఈ-పాస్) అమలుతో రేషన్ సరుకులు మిగులు బాటు దేవుడెరుగు కానీ... లబ్ధిదారులైన నిరుపేదలకు మాత్రం వేలిముద్రల పరేషాన్ పట్టుకుంది. ఈ-పాస్ మిషన్ లోని ఆధార్ డేటా తో వేలి ముద్రలు సరిపోక నానా ఇబ్బందులు కలుగుతున్నాయి. సరుకుల కోసం చక్కర్లు తప్పడం లేదు. మరోవైపు చౌకధరల దుకాణాల డీలర్లకు ఈ-పాస్ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియ తలనొప్పిగా  తయారవుతోంది. ఫలితంగా మొదటి రెండు వారాల్లో కనీసం 25 శాతానికి మించి సరుకులు పంపిణీ చేయలేక పోయామని డీలర్లు పేర్కొంటున్నారు.  

ప్రజా పంపిణిలో సంస్కరణల్లో భాగంగా సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చౌక ధరల దుకాణాల్లో  ఈ-పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 12 సర్కిల్స్ పరిధిలో గల సుమారు 1543 షాపుల్లో ఈ- పాస్ ద్వారా సరుకులు పంపిణీ కొనసాగుతోంది. ఈ విధానం సరుకులు పక్కదారి పట్టకుండా కట్టడి చేస్తున్నప్పటికీ సరుకులు కొనుగోలు కోసం రేషన్ షాపులకు వచ్చే అసలైన లబ్ధిదారులకు మాత్రం తిప్పలు తప్పడం లేద న్న ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి.
 
వేలిముద్రల ఆధారంగానే...
ఈ-పాస్ విధానంలో వేలిముద్రల ఆధారంగానే సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్ యం త్రాన్నిఆధార్ డేటాతో అనుసంధానం చేయడంతో లబ్ధిదారుడి వేలిముద్రలు సరి పోల్చుతున్నారు. చౌకధరల దుకాణానికి సరుకుల కొనుగోలు కోసం లబ్ధిదారుడు ఆహార భద్రత రేషన్ కార్డు డేటా స్లిప్ తీసుకొస్తే డీలర్ ఈ-పాస్ యంత్రం పై  కార్డు నెంబర్  నమోదు చేస్తున్నారు. కార్డులోని లబ్ధిదారులు వివరాలు డిస్‌ప్లే అనంతరం సరుకులు కొనుగోలు కోసం వచ్చిన వ్యక్తి పేరు ఉంటే దానిని టిక్ చేసి వేలి ముద్ర తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ-పాస్ యంత్రానికి ఆధార్ అనుసంధానం ఉన్న కారణంగా లబ్ధిదారుడి వేలిముద్ర సరిపోతే అమోదం అని డిస్‌ప్లే అవుతుంది. ఒక వేళ కా కుంటే  బయోమెట్రిక్ మ్యాచ్ కావడం లేదని డిస్ ప్లే అవుతోంది, సదరు లబ్ధిదారుల మిగిలిన వేళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. ఒక వేళ లబ్ధిదారుడి పది వేలిముద్రలు కూడా సరి పోకుంటే అదే కుటుంబంలోని మిగతా సభ్యులు  వేలిముద్రలను సేకరించి సరి పోల్చాల్సి ఉంటుంది. సదరు కుటుంబంలో ఒకరి వేలి ముద్ర మ్యాచ్ అయినా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. సరిపోతేనే సరుకుల  మెనూలో  వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత సరుకులు గుర్తింపు, బిల్లింగ్  ప్రక్రియ ముగిసిన తర్వాతనే సరుకులు పంపిణీ జరుగుతుంది. ఒక లబ్ధిదారుడికి సరుకులు పంపిణీ చేసేందుకు కనీసం 20 నిమిషాల వరకు అవుతోంది.
 
కష్టజీవుల వేలిముద్రల్లో..
నిరుపేదలైన కష్ట జీవులకు కష్టం వచ్చి పడింది. ఈ-పాస్ పై వేలిముద్రలు సరిపోలడం లేదు. అధిక శాతం కూలీలు, రిక్షా కార్మికులు, వృద్దులు, చిన్నారుల వేలిముద్రలు ఈ-పాస్ ఆధార్‌తో సరిపోవడం లేదు. గతంలో ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలుముద్రలు ప్రస్తుత వేలుముద్రల్లో  కొద్ది మార్పులు  జరగడం తో ఈ- పాస్‌లో సరిపోలడం లేదు. ముద్రలు ఎర్రర్ చూపిస్తున్న కారణంగా డీలర్లు వారికి రేషన్ సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో వారు తిరిగి ఆధార్ కేంద్రాలకు వెళ్లి తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సింగిల్ లబ్ధిదారులైన కార్డుదారులు సరుకుల కొనుగోలు కోసం రేషన్ షాపులకు రాక తప్పడం లేదు. మరోవైపు సర్వర్ డౌన్ కూడా పెద్ద సమస్యగా తయారైంది.
 
సరుకులు వస్తాయన్న నమ్మకం లేదు

రేషన్ సరుకుల కోసం దుకాణానికి వెళితే సరుకులు వస్తాయన్న నమ్మకం లేకుండా పోతుంది. మిషన్‌పై వేలి ముద్రలు త్వరగా పడడం లేదు. ఒక్కోసారి దుకాణం నుంచి ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. ఈ విధానాన్ని ఎత్తివేయాలి. రేషన్ దుకాణం వద్ద కూడా సరుకుల కోసం చాలా ఆలస్యమవుతోంది.     -శోభ, ఉప్పుగూడ.                    
 
వేలిముద్రలు సరిపోవడం లేదు
సరుకులకు వేలిముద్రలకు లింక్ పెట్టారు. సరుకులు తీసుకోవడం కష్టతరమవుతోంది. ఎప్పుడో ఐదారేళ్ల క్రితం తీసుకున్న వేలి ముద్రలకు ఇప్పుడు ఆమోదించడం లేదు. చిన్నారులను పంపించడం కుదరదు. మా లాంటి వారు వెళ్లి అవస్థలు పడుతున్నాం. వేలి ముద్రలు ఆమోదించని సమయంలో ఏఎస్‌వోను కలవాలని రేషన్ డీలర్...రేషన్ డీలర్‌ను కలవాలని అధికారులు తిప్పుతున్నారు.
- కె.రాజ్‌లింగం, జంగమ్మెట్

మరిన్ని వార్తలు