భారీ టెలిస్కోప్.

27 Jun, 2014 00:52 IST|Sakshi

- ఈసీఐఎల్ చరిత్రలో మరో కలికితురాయి
- ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్ ‘మేస్’ రూపకల్పన

హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) చరిత్రలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్ ‘మేజర్ అట్మాస్ఫెరిక్ చెరింకోవ్ ఎక్స్‌పరిమెంట్’ (మేస్) రూపకల్పనతో మరోసారి వార్తల్లో నిలిచింది. సూర్యుని నుంచి వెలువడే ‘గామా’ కిరణాలు మన వాతావరణంపై చూపుతున్న ప్రభావానికి సంబంధించి ఈ పరిశోధనలు కొనసాగుతాయని, దీనిద్వారా విశ్వ మానవాళికి ఎంతో ఉపయోగపడే ఫలితాలు రాబట్టవచ్చునని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

దాదాపు 21 మీ.ల ఎత్తు, 180 టన్నుల బరువు ఉండే ఈ టెలిస్కోప్‌లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా -26 డిగ్రీల నుంచి 270 డిగ్రీల కోణంలో 27 మీటర్ల వ్యాసార్థ పరిధిలో గామా కిరణాలను చిత్రీకరించి, భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. ఈ కంట్రోల్ రూమ్ నుంచే టెలిస్కోప్‌ను నియంత్రిస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో దాదాపు 28మీటర్ల ఎత్తు ఉన్న ‘హెస్’ టెలిస్కోప్ నమీబియాలో ఉంది.
 
‘లడఖ్’లో ఏర్పాటు...
 జమ్మూకాశ్మీర్ పరిధిలో ఉన్న ‘లడఖ్’ ప్రాంతంలోని హన్లే వద్ద ఏర్పాటు చేయనున్న ఈ ‘మేస్’ టెలిస్కోప్ ఈ నెల 28న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉత్తర భారతదేశానికి పయనమవుతోంది.

మరిన్ని వార్తలు