'ఎస్‌ఈ ఆఫీసులలో ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్లు'

23 Sep, 2016 19:08 IST|Sakshi
'ఎస్‌ఈ ఆఫీసులలో ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్లు'

హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ) కార్యాలయాల్లో ఎమర్జెన్సీ కాల్‌సెంటర్‌లు ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఆదేశించారు. ఒక ప్రత్యేక ఫోన్‌నంబర్‌ ఏర్పాటు చేసి అన్ని టీవీ ఛానళ్లు, ఇతర వార్త ప్రసార సాధనాల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి ఇరిగేషన్ శాఖ సన్నధ్దంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన వర్షాలపై సీఈ, ఎస్‌ఈ, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఆందోళన కల్గిస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నధ్దంగా ఉండాలన్నారు. వర్షాలతో వేలాది చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయని, ఈ దృష్ట్యా ఇంజనీరంతా క్షేత్రస్థాయికి వెళ్లి విధులు నిర్వహించాలన్నారు.

చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున వరద నీటిని సురక్షితంగా అతి తక్కువ నష్టంతో దిగువకు విడుదల చేయాలని కోరారు. వరద నీరు చేరుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి గ్రామ సర్పంచులు, వీఆర్వోలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చెరువు కట్టలు, కాల్వల గండ్లను, బుంగలను వెంటనే పూడ్చేందుకు ఇసుక బస్తాలను సిధ్దం చేసుకోవాలని ఆదేశించారు. అన్ని స్థాయిల్లో ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను, ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే చర్యలు తీసుకోవాలన్నారు. కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు మంత్రి పేషీకి, రెవెన్యూ అధికారులకు, ఉన్నతాధికారులకు అందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు