కరెన్సీ.. ఎమర్జెన్సీ..!

10 Nov, 2016 07:20 IST|Sakshi
కరెన్సీ.. ఎమర్జెన్సీ..!

బ్యాంకుల మూత.. పనిచేయని ఏటీఎంలు, ఆన్‌లైన్ డిపాజిట్‌ల కోసం భారీ క్యూలు
ఆన్‌లైన్ చెల్లింపుల్లో సర్వర్‌డౌన్.. స్తంభించిన వ్యాపార లావాదేవీలు.. చెల్లింపులు
బస్‌స్టేషన్‌లు, రైల్వేస్టేషన్లలో టిక్కెట్ల కోసం జనం బారులు
అంతా పెద్ద నోట్లతోనే క్యూ.. చిల్లర సమస్యలతో జనం ఇబ్బందులు
పెట్రోల్ బంకుల వద్దా అదే పరిస్థితి.. ఆసుపత్రులు, మాల్స్‌లో పెద్ద నోట్ల తిరస్కరణ  

 
 సాక్షి, హైదరాబాద్:
పెద్ద నోట్ల రద్దుతో మహానగరం ఒక్కసారిగా కకావికలమైంది. ఒకవైపు పనిచేయని బ్యాంకులు, ఏటీఎంలు. మరోవైపు సర్వత్రా రూ.500, రూ.1,000 నోట్ల తిరస్కరణ. దీంతో పెద్ద నోట్లు బుధవారం నగర వాసులకు కష్టాలు తెచ్చి పెట్టాయి. పెట్రోల్ బంకులు, షాపింగ్‌మాల్స్, ఆసుపత్రులు, మార్కెట్ ఇలా ఎక్కడికెళ్లినా.. బస్సెక్కినా, రైలు టికెట్ కోసం వెళ్లినా అంతటా రూ.500, రూ.1,000 నోట్లకు చుక్కెదురే అయింది.
 
 పెట్రోలు బంకుల్లో, ఆర్టీసీ బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పాలబూత్‌లలో పెద్ద నోట్టు చెల్లుబాటు అయినా చిల్లర లేకపోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో నగరమంతటా వ్యాపార లావాదేవీలు స్తంభించాయి. ఇక కేంద్రం ప్రకటించిన మేరకు బ్యాంకులు మూతపడ్డాయి. ఏటీఎంల సేవలు నిలిచిపోయాయి. ఇక ఆన్‌లైన్ లో చెల్లింపుల కోసం కూడా వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్ చెల్లింపులు జరగడంతో సర్వర్లు డౌనై సేవలు నిలిచిపోరుు జనం గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థలు నగదు చెల్లింపులను నిలిపివేశాయి.
 
 ఆసుపత్రుల్లో రోగుల ఇబ్బందులు..

 నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.500, రూ.1,000 నోట్లు చలామణి అయినప్పటికీ చిల్లర సమస్య రోగులు, వారి బంధువులను ఇబ్బందులకు గురి చేసింది. ఇన్‌పేషెంట్లుగా చేరేవారి నుంచి పెద్ద నోట్లు తీసుకున్నా.. బయటి రోగులకు మాత్రం వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం, వైద్యుల ఫీజుల కోసం, మందుల కొనుగోళ్ల కోసం ఇక్కట్లు తప్పలేదు. ఇక గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తదితర ఆసుపత్రుల్లో అయితే రోగులు నరకం చవిచూశారు.
 
 మార్కెట్లు, మాల్స్ వెల వెల..
 నగరంలోని బిగ్‌బజార్, మోర్, స్పెన్సర్, హెరిటేజ్, డీమార్ట్, రిలయన్‌‌స, మొబైల్ షోరూమ్‌లు, సినిమాహాళ్లు వెలవెలబోయాయి. రూ.500 ,రూ.1,000 నోట్లతో వెళ్లి వస్తువులు కొనుగోలు చేసిన వాళ్లు చివరి క్షణంలో బిల్లు చెల్లించే సమయంలో నిరాకరించడంతో ఘర్షణకు దిగారు. బార్లు, వైన్‌షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లకు సైతం గిరాకీ తగ్గింది. కొన్ని చోట్ల వైన్‌షాపులు, బార్ల వద్ద వినియోగదారులు నిర్వాహకులతో గొడవకు దిగారు. ఇక ప్రజలు కూరగాయల మార్కెట్లకు వెళ్లకపోవడంతో అవి వెలవెలబోయాయి. రూ.500 నోట్లను తీసుకునేందుకు అక్కడి వ్యాపారులు నిరాకరించడంతో వచ్చిన కొద్దిమంది కాస్తా కూరగాయలు తీసుకోకుండానే తిరిగి వెళ్లిన పరిస్థితి కనిపించింది. మార్కెట్లకు వెళితే చిల్లర తంటాలు ఎదురవడంతో సిటీవాసులు తమకు సమీపంలోని కిరాణా దుకాణాలకు దారి పట్టారు. దీంతో గల్లీలోని కిరాణాషాప్‌ల్లో వ్యాపారం ఊపందుకుంది.
 
 హోటళ్లలోనూ ‘నోట్ల’ తిప్పలు..

 సిటీలోని చాలా హోటళ్లలోనూ నోట్ల తిప్పలు, చిల్లర తంటాలు కనిపించాయి. టిఫిన్‌‌స, భోజనం చేద్దామని వెళ్లిన వారు పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. టిఫిన్ చేసిన కొంత మంది తమ వద్ద చిల్లర లేదని చెప్పడంతో కొన్నిచోట్ల గొడవలు కూడా చోటుచేసుకున్నాయి. నోట్ల రద్దు వల్ల చాలా హోటళ్లలో వ్యాపారం బాగా తగ్గిందని వ్యాపారులు అంటున్నారు.
 
 కౌంటర్‌లు కిట కిట..
 రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో, టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌ల వద్ద  ప్రయాణికులు బారులు తీరారు. దూరప్రాంతాలకు వెళ్లేందుకు రిజర్వేషన్ కార్యాలయాల్లో రూ.500, రూ.1,000 నోట్లతో ఇబ్బంది లేకపోయినా చిల్లర ఇవ్వాల్సి వచ్చినప్పుడు కౌంటర్లలో చేతులెత్తేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రూ.350 టిక్కెట్ కోసం  రూ.500 నోటు ఇచ్చిన వారికి తిరిగి రూ.150 చెల్లిం చడం పెద్ద సమస్యగా మారింది. దీంతో చాలా మంది రిజర్వేషన్లు చేసుకోకుండా వెనక్కి వెళ్లిపోయారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఇదే సమస్య ఎదురైంది. చిల్లర లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది చేతులెత్త్తేశారు.
 
 డబ్బులు బదులు టికెట్ డిపాజిట్ స్లిప్‌లు

 రైల్వే టికెట్ కొన్నప్పుడు చిల్లర ఇవ్వాల్సి వస్తే నగదు బదులు డిపాజిట్ రశీదులు ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని తర్వాత నగదుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యం లో పరిస్థితిని సమీక్షించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
 కిక్కిరిసిన పెట్రోల్ బంకులు

 గ్రేటర్‌లో పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసి పోయారుు. పెద్ద నోట్ల రద్దుతో వాహనదారులు తమ వాహనాల్లో ఒక లీటర్, రెండు లీటర్లు కాదు.. ట్యాంకులు నింపుకోక తప్పలేదు. ఫలితంగా బుధవారం సగటు కంటే 30 నుంచి 40 శాతం వరకు అదనంగా పెట్రో, డీజిల్ అమ్మకాలు పెరిగాయి. మరోవైపు వాహనదారులు అష్ట కష్టాలు పడ్డారు. బంకుల నిర్వాహకులు తమ వద్ద చిల్లర లేదంటూ.. రూ.500.. రూ.వెయికి తక్కువ పెట్రోల్ పోయమని తేల్చి చెప్పారు. ప్రతి వాహనదారులు రూ.500.. రూ.వెరుు్యకి పెట్రోల్.. డీజిల్ పోరుుంచుకున్నారు. పెట్రోల్ బంకుల యజమానులు ఆరుుల్ కంపెనీల నుంచి ముందస్తు ట్యాంకర్లను తెప్పించుకుంటుండటంతో ఎలాంటి కొరత ఏర్పడ లేదు.
 
 నోట్ల మార్పిడి.. ఓ నయా దందా
 రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వంద నోట్ల కోసం నానా అవస్థలు పడ్డారు. ఏటీఎంలు పనిచేయకపోవడంతో తమ జేబులో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు తంటాలు పడ్డారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు రూ.1,000 నోట్లకు రూ.800..రూ.700, రూ.500కు రూ..400.. రూ.300 చిల్లర ఇచ్చి దోచేసుకున్నారు. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, పెట్రోల్ బంకులు, మార్కెట్లు.. మొదలైన చోట్ల ఈ వ్యాపారం జోరుగా సాగింది. రాష్ట్రంలో కోట్ల రూపాయల్లో ఈ వ్యాపారం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు