ఏడేళ్లు ఆచూకీ లేకుంటే చనిపోయినట్లే

3 Feb, 2017 06:31 IST|Sakshi
ఏడేళ్లు ఆచూకీ లేకుంటే చనిపోయినట్లే

అదృశ్య ఉద్యోగులపై కేంద్రానికి స్పష్టం చేసిన హైకోర్టు  
సాక్షి, హైదరాబాద్‌: ఒక ఉద్యోగి ఏడేళ్లుగా అదృశ్యమై ఆతర్వాత కూడా ఆచూకీ లభించకపోతే చనిపోయినట్లుగానే భావించాలని కేంద్రానికి ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగరీత్యా ఆ వ్యక్తికి రావాల్సిన పెన్షన్‌ ప్రయోజనాలన్నిం టినీ.. అతని కుటుంబానికి వర్తింపజేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అదృశ్యమైన వ్యక్తి ఏడేళ్లుగా విధులకు గైర్హాజరవడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశామని, అతని కుటుంబానికి పెన్షన్‌ ప్రయోజనాలు అందించాల్సిన అవసరం లేదన్న కేంద్రం వాదనలను తోసిపుచ్చింది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ భర్త అదృశ్యమై ఏడేళ్లు దాటినందున అతనికి రావాల్సిన పెన్షన్‌ ప్రయోజనాలన్నీ అతని భార్యకు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసా ద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఏలూరు డివిజన్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ముద్రణ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తన భర్త 1994 నుంచి కనిపించడం లేదంటూ ఏలూరుకు చెందిన పాలిమెట్ల మేరీ సరోజిని 1994 సెప్టెంబర్‌ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి న పోలీసులు దర్యాప్తు చేసి 1997లో నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఏడేళ్ల తర్వాత సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారులకు ఫ్యామిలీ పెన్షన్‌ కోసం ఆమె వినతి పత్రం సమర్పించారు. అతన్ని ఉద్యోగం నుంచి తీసేశామని, అందువల్ల పెన్షన్‌ ప్రయోజనాలు రావని అధికారులు తేల్చి చెప్పారు. దీనిపై సరోజిని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ సరోజినికి అనుకూ లంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి 3 రోజుల క్రితం తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు