హరితహారానికీ ‘ఉపాధి హామీ’

12 Jul, 2016 02:37 IST|Sakshi

- రూ.800 కోట్లతో గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికలు
- మొక్కలను సంరక్షించే ఉపాధి కూలీలకు దినసరి వేతనాలు
 
 సాక్షి, హైదరాబాద్ : హరితహారానికి ఉపాధి హామీ నిధులను వెచ్చించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం నుంచి సుమారు రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉపాధిహామీ చట్టంలోని కేటగిరి -ఎ ప్రకారం అడవులు, రహదారులు, చెరువు గట్లు, ప్రభుత్వ విద్యా, పారిశ్రామిక సంస్థలు, కమ్యూనిటీ స్థలాలు తదితర ప్రదేశాల్లోనూ, కేటగిరి-బి మేరకు ఇళ్లు, పంట పొలాలు తదితర వ్యక్తిగత స్థలాల్లో మొక్కలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం, రవాణా, మొక్కల పెంపకం, వాటిని సంరక్షించేవారికి దినసరి వేతనాలను కూడా ఉపాధి హామీ నుంచే కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొత్తం 15 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మూడు కోట్లకుపైగా మొక్కలను పెంచుతున్నారు. ఆయా నర్సరీల్లో ఇప్పటికే సుమారు 60 లక్షల ఈత మొక్కలు, 40 లక్షల పండ్లు, పూలు, 6 లక్షల టేకు మొక్కలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 13 వేల కిలోమీటర్ల మేర రహదారుల వెంట మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది పొడవునా ఉపాధిహామీ పథకం కింద హరితహారాన్ని కొనసాగించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది.

 కోటి మొక్కల హరితహారం నేడే
 హరితహారంలో భాగంగా మంగళవారం ఒక్కరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలను నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దామరగిద్ద గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల  క్షేత్రస్థాయి అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. కోటి మొక్కల హరితహారంలో 4.15 లక్షల స్వయం సహాయక గ్రూపుల నుంచి 47.21 లక్షల మంది మహిళలు పాల్గొంటారని మంత్రి తెలిపారు. సమావేశంలో కమిషనర్ అనితారాంచంద్రన్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో పౌసమీ బసు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు