ఉత్కంఠ

31 Jan, 2016 01:19 IST|Sakshi
ఉత్కంఠ

* నేటితో ఎన్నికల ప్రచారానికి తెర
* సాయంత్రం 5 గంటల వరకే అవకాశం
* ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వ ప్రయత్నాలు
* భారీ ర్యాలీలు, సభలతో బల ప్రదర్శన
* అంతటా నేడు ఓటరు స్లిప్పుల పంపిణీ

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. సభలు, సమావేశాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అన్ని రకాల ప్రచారాన్నీ నిలిపివేయనున్నారు.

బల్క్ ఎస్సెమ్మెస్‌ల ప్రచారం కూడా చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. చివరి రోజును వివిధ పార్టీలు డివిజన్ స్థాయిలోనే భారీ సభలు, ర్యాలీలతో బల ప్రదర్శనకు వాడుకునే దిశగా ఏర్పాట్లు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్ శనివారం రాత్రి పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన సభ విజయవంతం కావటంతో ఆ జోష్‌ను పోలింగ్ రోజు వరకు కొనసాగించే దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించింది. బీజేపీ, టీడీపీల తరఫున చివరి రోజు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయతో పాటు ఏపీ శాఖ అధ్యక్షుడు హరిబాబు కూడా వివిధ సభల్లో  పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసీసీ నాయకులు సల్మాన్ ఖుర్షీద్, టీపీసీసీ నేతలు వివిధ ప్రాంతాల్లో జరిగే ర్యాలీల్లో పాల్గొననున్నారు.
 
ఓటరు స్లిప్పుల పంపిణీకి ప్రత్యేక  ఏర్పాట్లు
మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌లో పాల్గొనే ఓటర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని అన్ని పోలింగ్ బూత్‌లు, వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో ఓటరు స్లిప్పులు అందజేయనున్నారు. ఇప్పటికే నగరంలో ఇంటింటికీవెళ్లి సుమారు 40 లక్షలు పంపిణీ చేశారు. వెబ్ నుంచి4.10 లక్షలు, యాప్ నుంచి 1.74 లక్షల స్లిప్పులు ఓటర్లకు చేరిపోయాయి. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాల్లో 25 వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. సుమారు 3,200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
 
52, 722 ఓటరు స్లిప్పుల డౌన్‌లోడ్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి శనివారం మొత్తం 52,722 మంది ఓటర్ స్లిప్పులు డౌన్‌లోడ్ చేసున్నారు. వీరిలో వెబ్‌సైట్ నుంచి 14,027 మంది డౌన్‌లోడ్ చేసుకోగా, మరో 38,695 మంది మొబైల్ నుంచి డౌన్‌లోడ్ చేసున్నారు.

మరిన్ని వార్తలు