ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

10 Jun, 2016 01:13 IST|Sakshi
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

63,500 మందికి చేప ప్రసాదం
సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 8, 9 తేదీల్లో(బుధ, గురువారాల్లో) మొత్తం 63,500 మందికి చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఒక్కో చేపను రూ.15 చొప్పున విక్రయించటం ద్వారా మత్స్య శాఖకు రూ.9,52,500 ఆదాయం సమకూరింది. బుధవారం మొదలైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం 9.00 గంటల వరకు కొనసాగింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు చేప ప్రసాదం కోసం నగరానికి తరలివచ్చారు. రెండు రోజుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా, ప్రశాంతంగా నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు.

చేప పంపిణీ కోసం పక్కా ఏర్పాట్లు చేసిన పోలీసు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, జలమండలి, జీహెచ్‌ఎంసీ, మత్స్య, సమాచార, విద్యుత్తు తదితర శాఖల అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన వారికి, వారి సహాయకులకు మంచినీరు, అల్పాహారం, మజ్జిగ, భోజనం వంటి సదుపాయాలు అందించిన వివిధ స్వచ్ఛంధ సేవా సంస్థల సేవలను కలెక్టర్ కొనియాడారు. మరోవైపు బత్తిని సోదరులు గురువారం ఉదయం నుంచి చేప ప్రసాదాన్ని పాతబస్తీ దూద్‌బౌలిలోని స్వగృహంలో ఉచితంగా పంపిణీ చేశారు.

దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది చేప ప్రసాదం కోసం తరలిరావడంతో ఇక్కడి వీధులన్నీ కిటకిటలాడాయి. మత్స్య శాఖ తరపున చేప పిల్లలను అందుబాటులో ఉంచకపోవడంతో స్థానికులు కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి అనధికారికంగా ఐదారు కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక్కో చేప పిల్లను రూ.200 నుంచి 500 వరకు విక్రయించారు. చేపతో పాటు ప్రసాదాన్ని కూడా అందజేస్తే మరో రూ.100 లు అధికంగా వసూలు చేశారు.

మరిన్ని వార్తలు