‘మేనేజ్‌మెంట్’ సీట్ల భర్తీ అంతంతే!

6 Dec, 2016 04:15 IST|Sakshi
‘మేనేజ్‌మెంట్’ సీట్ల భర్తీ అంతంతే!
ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిన 15,744 యాజమాన్య కోటా సీట్లు
 భర్తీ అయిన సీట్ల సంఖ్య 14,794కే పరిమితం
 బీఫార్మసీలోనూ అదే పరిస్థితి.. 60 శాతం సీట్లే భర్తీ
 ప్రభుత్వానికి నివేదించిన ఉన్నత విద్యా మండలి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డీ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ అయిన సీట్ల లెక్క తేలింది. యాజమాన్య కోటాలో కాలేజీల్లో చేరిన విద్యార్థుల ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ర్యాటిఫికేషన్లను పూర్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లెక్కలు అందజేసేందుకు నివేదికలు సిద్ధం చేసింది. గతేడాది మేనేజ్‌మెంట్ కోటాలో దాదాపు 55 శాతం సీట్లు భర్తీ కాగా ఈసారి మాత్రం కేవలం 48.44 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ప్రవేశాల కోసం యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లు కూడా మొత్తం భర్తీ కాలేదు. 2016-17 విద్యా సంవత్సరంలో 219 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,04,598 సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది.
 
  అందులో 74,060 సీట్లను (ప్రభుత్వ కాలేజీల్లోని 2,805 సీట్లు వంద శాతం కలుపుకొని) 70 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చర్యలు చేపట్టగా, అందులో 54,172 సీట్లు భర్తీ అయ్యాయి. 30 శాతం మేనేజ్‌మెంట్ కోటాలో 30,538 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 14,794 సీట్లే భర్తీ అయ్యాయి. 15,744 సీట్లు మిగిలిపోయాయి. అలాగే 123 బీఫార్మసీ కాలేజీల్లో 9,226 సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టగా మేనేజ్‌మెంట్ కోటాలోని 2,714 సీట్లలో 1,592 సీట్లే భర్తీ అయ్యాయి. ఇక ఫార్మ్-డీలో 54 కాలేజీల్లోని 1,620 సీట్లలో మేనేజ్‌మెంట్ కోటా పరిధిలో ఉన్న 486 సీట్లలో 384 సీట్లు భర్తీకాగా 102 సీట్లు మిగిలిపోయాయి.
 
>
మరిన్ని వార్తలు