తట్టుకోలేం.. తప్పుకుందాం!

20 Apr, 2017 03:51 IST|Sakshi
తట్టుకోలేం.. తప్పుకుందాం!

- జేఎన్‌టీయూహెచ్‌ నుంచి నిష్క్రమించాలని యోచిస్తున్న కాలేజీలు
- సమీప వర్సిటీల నుంచి అఫిలియేషన్‌ తీసుకునేందుకు ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల యత్నం
- జేఎన్‌టీయూ నిబంధనలు, తనిఖీల నుంచి తప్పించుకునే ఎత్తుగడ
- ఇప్పటికే అర్జీలు పెట్టుకున్న 19 కాలేజీలు


కాలేజీ వ్యవహారాల కోసం కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు పలు దఫాలుగా రావడం అసౌకర్యంగా ఉంది. ఇందుకు సమయం వృథా కావడంతోపాటు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కాలేజీకి దగ్గరలో ఉన్న శాతవాహన యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్‌ తీసుకోవాలని భావిస్తున్నాం. అందుకు ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం)తో అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.ఇటీవల జేఎన్‌టీయూహెచ్‌కు కరీంనగర్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ పెట్టుకున్న దరఖాస్తు సారాంశమిది.

సాక్షి, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌) నుంచి కొన్ని ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నిష్క్రమించాలని యోచిస్తున్నాయి. దూరాభారం, సమయ పాలనలో సమస్యల్ని సాకుగా చూపుతూ సమీపంలో ఉన్న వర్సిటీల నుంచి అఫిలియేషన్‌ తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం అనుమతి ఇవ్వాలంటూ వర్సిటీకి వినతులు సమర్పిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 19 ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ కాలేజీలు దరఖాస్తు పెట్టుకున్నాయి. వర్సిటీ మార్పు కోసం పెద్ద సంఖ్యలో కాలేజీలు దరఖాస్తు చేసుకోవడంపై జేఎన్‌టీయూహెచ్‌ యంత్రాంగం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ప్రఖ్యాత వర్సిటీ గుర్తింపు కాకుండా చిన్నపాటి వర్సిటీల వైపు కాలేజీల చూపేంటని సందిగ్ధంలో పడింది. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో 315 ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ (ఎంబీఏ, ఎంసీఏ) కాలేజీలు ఉండగా, ఇందులో 147 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి.

తప్పించుకునేందుకేనా?
రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో సగానికిపైగా కాలేజీలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు నేపథ్యంలో ఇంజనీరింగ్‌ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు కాలేజీల అఫిలియేషన్‌ విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా జేఎన్‌టీయూ తనిఖీలు కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో వసతులు సరిగ్గా లేని కాలేజీలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాజమాన్యాలు జేఎన్‌టీయూ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వర్సిటీ మార్పు తెర మీదకు తీసుకొచ్చాయి. జేఎన్‌టీయూ నుంచి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, కాలేజీకి సమీపంలో ఉన్న వర్సిటీ నుంచి అఫిలియేషన్‌ తీసుకోవాలని ఎత్తుడగ వేశాయి. ఈ క్రమంలో వర్సిటీ మార్పు కోసం జేఎన్‌టీయూకు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. ఇప్పటివరకు 19 కాలేజీలు వర్సిటీ మార్పును కోరుతూ వినతులిచ్చాయి.

ఆచితూచి అడుగులు
యూనివర్సిటీ మార్పు అంశం చిన్నదే అయినా జేఎన్‌టీయూ మాత్రం నిశితంగా పరిశీలిస్తోంది. దరఖాస్తు చేసుకున్న కాలేజీల పరిస్థితి, మౌళిక వసతులు తదితర అంశాలను లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకో నుంది. ఈ మార్పులతో కాలేజీల సంఖ్య తగ్గితే వర్సిటీ పరపతిని ప్రభావితం చేస్తుం ది. అధిక సంఖ్యలో కాలేజీలు, పెద్ద ఎత్తున పరిశోధనలతో ఉన్న జేఎన్‌టీయూ నుంచి కాలేజీలు నిష్క్రమిస్తే పరిధి చిన్నది కావడంతోపాటు కార్యక్రమాలు తగ్గిపోతాయి. ఈ క్రమంలో వర్సిటీల మార్పు కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జేఎన్‌టీయూ ఆచితూచి వ్యవహరిస్తోంది.

కాలేజీల సంఖ్య తగ్గడంతో న్యాక్‌(నేషనల్‌ అసిస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) ఇచ్చిన ‘ఏ’ గ్రేడ్‌కూ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాలేజీల్లో ప్రమాణాలు సైతం తగ్గుతాయని ఆందోళన చెందుతోంది. దీంతో తమ పరిధిలోని కాలేజీలను ఇతర వర్సిటీల పరిధికి వెళ్లనివ్వకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాలేజీల నుంచి వచ్చిన అర్జీలను ప్రభుత్వానికి, ఉన్నత విద్యా మండలికి నివేదించాలని నిర్ణయించింది. మార్పు ప్రక్రియను ఆమోదిస్తే మరిన్ని కాలేజీలకు అవకాశం కల్పించినట్లవుతుందని భావిస్తున్న జేఎన్‌టీయూహెచ్‌ ఆ మేరకు ప్రభుత్వానికి సూచన చేసేందుకు సిద్ధమవుతోంది.

>
మరిన్ని వార్తలు