3,417 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం

21 Jun, 2016 01:14 IST|Sakshi
3,417 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం

- ప్రారంభించిన విద్యా శాఖ
- కరీంనగర్‌లో అత్యధికంగా వెయ్యి పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం
- మహబూబ్‌నగర్‌లో అత్యల్పంగా 7 స్కూళ్లలోనే మొదలు
- మూసివేత ముప్పు నుంచి బయటపడ్డ 195 ప్రాథమిక పాఠశాలలు
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్టకేలకు ఇంగ్లిష్ మీడియం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,417 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను విద్యా శాఖ ప్రారంభించింది. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 1,000 పాఠశాలల్లో.. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యల్పంగా 7 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైనట్లు విద్యా శాఖ లెక్కలు వెల్లడించాయి. ఇక ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 7,26,766 మంది విద్యార్థులు చేరతారని విద్యా శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 3,14,723 మందిని చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1,72,055 మందిని స్కూళ్లలో చేర్పించగలిగింది.

ఇందులో 70,471 మంది పిల్లలను అంగన్‌వాడీ టీచర్లే బడుల్లో చేర్పించారు. కాగా, రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని 356 ప్రాథమిక పాఠశాలల్లో 195 స్కూళ్లు మూసివేత ముప్పునుంచి బయటపడ్డాయి. వీటిలో విద్యార్థులు చేరడంతో తిరిగి ప్రారంభమయ్యాయి. వాటిలో కొన్నింటిలో తెలుగు మీడియం ప్రారంభించగా, మరికొన్నింటిలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టారు. మూతపడకుండా ఎక్కువ స్కూళ్లను నల్లగొండ జిల్లా టీచర్లు కాపాడుకున్నారు. అక్కడ ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 112 ఉంటే బడిబాట కార్యక్రమంలో 92 పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించారు. వరంగల్ జిల్లాలో 36 స్కూళ్లు ఒక్క విద్యార్థి లేనివి ఉండగా అందులో 32 స్కూళ్లలో ఈసారి విద్యార్థులను చేర్పించారు. మెదక్‌లో సున్నా స్కూళ్లు 10 ఉంటే 8 స్కూళ్లలో విద్యార్థులను చేర్పించడంతో మూసివేత ముప్పు తప్పింది.

>
మరిన్ని వార్తలు