వ్యాపారవేత్తలే బ్రాండ్‌ అంబాసిడర్లు!

17 Sep, 2017 03:55 IST|Sakshi
వ్యాపారవేత్తలే బ్రాండ్‌ అంబాసిడర్లు!
ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్‌
- ఈఓడీబీపై వ్యాపారవేత్తలకు అవగాహన సదస్సు
350 ఈఓడీబీ సంస్కరణలను అమల్లోకి తెచ్చామని వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్‌: ‘‘నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అక్కడ కేంద్ర పరిశ్రమల శాఖ అధికారులను, ఆ శాఖ మంత్రిని కలుస్తుంటాను. ఇటీవల కొత్తగా బాధ్యత లు స్వీకరించిన మంత్రి సురేశ్‌ ప్రభును మర్యాదపూ ర్వకంగా కలిశాను. ‘దేశంలోనే అత్యంత ప్రగతి శీల రాష్ట్రానికి చెందిన మంత్రి ఇతను’ అని ఆయన నన్ను అక్కడున్న వారికి పరిచయం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి ఈ రోజు దేశంలో ఉన్న గుర్తింపు అది. తెలంగాణ ప్రభుత్వం దేశంలో అత్యంత ప్రగతి శీల, క్రీయా శీల ప్రభుత్వం’’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు.

సరళీకృత వ్యాపారం (ఈఓడీబీ)పై శనివారం పారిశ్రామికవేత్త లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలే రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసి డర్లని కొనియాడారు. వ్యాపారవేత్తలు తమ అనుభ వాలను ఇతరులకు చెబుతుంటారని, వారి వల్ల రాష్ట్రంలో పరిశ్రమలకు ఉన్న పరిస్థితి గురించి ఇతర పారిశ్రామికవేత్తలకు అవగాహన కలుగుతుం దన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు బాగుందా, అవినీతి ఉందా, వ్యాపారం చేయాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా యి, తదితర అంశాలపై ఇక్కడి పారిశ్రామికవేత్తలు చెప్పే సమాధానాలకే విశ్వసనీ యత అధికంగా ఉంటుందన్నారు.
 
పరిశ్రమల మనుగడకు సహకరించాలి..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను సరిగ్గా చూసుకుంటేనే కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల రాకకు మార్గం ఏర్పడుతుందనికేటీఆర్‌ పేర్కొన్నారు. పరిశ్ర మల సమస్యలను పరిష్కరించి వాటి మనుగడకు సహకరించాలని, కొత్త పరిశ్రమల రాకకు ఇది దోహదపడుతుందని సీఎం కేసీఆర్‌ తమకు చెబుతుం టారని, దాన్నే అమలు చేస్తున్నామన్నారు. సరళీకృత వ్యాపార విధానానికి సంబంధించి 373 సంస్కర ణల్లో ఇప్పటికే 350 సంస్కరణలను అమలు చేశా మని, మిగిలిన సంస్కరణలను అమల్లోకి తెస్తా మన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతోందని ఇటీవల అసోచాం నివేదించిం దని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు లోటు పాట్లను సరిదిద్దుకోవడం ప్రగతిశీల ప్రభుత్వం చేయాల్సిన ప్రాథమిక కర్తవ్యమని అభిప్రాయపడ్డారు.
 
13వ ర్యాంకు నుంచి ప్రథమ స్థానానికి..
‘రెండేళ్ల నుంచి కేంద్రం రాష్ట్రాలకు ఈఓడీబీ ర్యాంకులు ఇస్తోంది. తొలి ఏడాది 13వ ర్యాంకు వచ్చినప్పుడు మేమంతా బాధపడ్డాం. ఇలా ఎందుకు జరిగిందని ఆత్మ విమర్శ చేసుకుంటే రెండు లోపాలు బయటపడ్డాయి. పారిశ్రామిక విధానం బాగా వచ్చినా, ఇంకా పూర్తిగా అమలు కాలేదని తేలింది. ఈఓడీబీ ర్యాంకులను మూల్యాంకనం చేసిన వారు ఇతర రాష్ట్రాలు చెప్పిన విషయాలను గుడ్డిగా పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని అనిపించింది. రెండో ఏడాది మాత్రం పట్టుదలతో 13వ ర్యాంకు నుంచి తొలి ర్యాంకుకు ఎగబాకడం సంతోషకరం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. బ్యాంకులు ఎడాపెడా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నోటీసులిచ్చి వేలం వేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇటీవల ఆర్బీఐ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరామని తెలిపారు. 
మరిన్ని వార్తలు