పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

22 Apr, 2017 23:42 IST|Sakshi
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి

సోమాజిగూడ: పర్యావరణ పరిరక్షణకు అటుప్రభుత్వాలు..ఇటు పౌరసమాజం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఇది అందరి బాధ్యతగా గుర్తించాలని పాట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి అన్నారు. ఒక చెట్టు నరికితే 10 మొక్కలు నాటేలా ఆచరణీయమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ (సీజీఎస్‌ ) ఆధ్వర్యంలో బేగంపేట సెస్‌ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన ఎర్త్‌డే, 7 వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

నాగరికత పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకం దెబ్బతిందన్నారు. పంచభూతాల మయమైన సృష్టిలో ఇప్పటికే గాలి, నీరు, భూమి కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదిడ్డమైన విధానాలు, ఆచరణీయమైన దృక్పథం లేకపోవడం, మానవ స్వార్థం మరింత చేటు చేస్తున్నాయన్నారు. ఒక సృష్టమైన విధానంతో ముందుకు వెళ్తేనే మనుగడ సాధ్యమన్నారు.

పర్యావరణం, మెక్కల పెంపకం, తూర్పు కనుమల పరిరక్షణకు అంకిత భావంతో కృషి చేస్తున్న సీజీఎస్‌ సంస్థను అభినందించారు. ముఖ్యమంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ మాట్లాడుతూ  ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని ఇల్లు, నీరు అడుగుతారని, దాంతో పాటు మెక్కలు కూడా పెంచాలని డిమాండ్‌ చేయాలని సూచించారు. మొక్కల పెంపకంలో విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అంబేద్కర్‌ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ సీతారామరావు మాట్లాడుతూ సంస్థ గత ఏడేళ్లుగా చేస్తున్న సేవలను అభినందించారు. సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ  లక్ష మెక్కల పెంపకం లక్ష్యంతో ఏడేళ్ల క్రితం ప్రారభమైన సీజీఎస్‌ సంస్థ నేడు లక్షలాది మొక్కలు పెంచే స్థాయికి చేరుకోవడంతో పాటు దాదాపు 1700 కిలోమీటర్లు విస్తరించి ఉన్న తూర్పు కనుమల పరిరక్షణ, నీటి సంరక్షణ  కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

ఈ క్రమంలో సంబంధిత రాష్ట్రాల ఎంపీలు, అధికారులు, సంస్థల మద్దతు కూడా కూడగట్టడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుండి ప్రత్యేక అవార్డులు  ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుండి సీజీఆర్‌ ఫౌండేషన్‌ లెక్చర్‌ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సంస్థ వ్యవస్థాపకులు లీలా లక్ష్మారెడ్డి గత ఏడేళ్ల ప్రగతిని వివరించారు.


పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి సంస్థతో తన అనుబంధం గుర్తు చేసుకున్నారు.  ఈ సందర్భంగా పర్యావరణ సమస్యలపై స్పందిస్తున్న వందేమాతరం ఫౌండేషన్, కళాకారుడు లెనిన్‌బాబు, నాగర్‌కర్నూల్‌ జిల్లా సిలార్‌పల్లిని గ్రీన్‌విలేజ్‌గా తీర్చిదిద్దిన యువకులు, రైతు నీలాలక్ష్మి, ఎన్‌జీవో సత్యశ్రీ, నెక్కొండలోని యూపీఎస్‌ స్కూల్,  డెక్కన్‌ క్రానికల్‌ జర్నలిస్ట్‌ సుధాకర్‌రెడ్డి , విద్యార్థి రమేష్‌లను సత్కరించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు పర్యావరణ ప్రియులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు