రిజర్వేషన్ల వర్గీకరణతో సమన్యాయం

25 Aug, 2017 00:46 IST|Sakshi

క్రీమీలేయర్‌ను తొలగించాలి: ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: ఓబీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై టీ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఓబీసీ జాబితాలో ఉన్న 2,600 కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ కులాల్లో కూడా హెచ్చుతగ్గుల వ్యత్యాసాలు ఉన్నాయని, ఇప్పుడు వర్గీకరణ చేయడంతో అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని వివరించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించినందుకు, ఓబీసీ రిజర్వేషన్లను వర్గీకరించినందుకు అక్టోబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని సన్మానించాలని నిర్ణయించామని తెలిపారు.

గురువారం సచివాలయం మీడియా పాయింట్‌లో కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రం 2011 జనాభా లెక్కలు తీసుకున్నా ఇంతవరకు కులాలవారీ లెక్కలు ప్రకటించలేదని, లెక్కలు ప్రకటిస్తేనే వర్గీకరణ పూర్తిగా జరుగుతుందన్నారు. గ్రూప్‌లలో చేర్చే కులాల జనాభా తెలిస్తే దాని ప్రకారం గ్రూపుల రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని, అప్పుడే వర్గీకరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జరుగుతుందని తేల్చి చెప్పారు. క్రీమీలేయర్‌ ఆదాయ పరిమితి పెంచడం కాదని, పూర్తిగా తొలగించాలన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయా లన్నారు. గుజ్జ కృష్ణ, గుజ్జ రమేశ్, నీల వెంకట్, కె.నరసింహగౌడ్, రాజేందర్, చీపురు మల్లేష్‌ యాదవ్, జి.కృష్ణయాదవ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు