జనరల్‌ ఆసుపత్రిగా ఛాతీ వైద్యశాల

30 May, 2017 02:34 IST|Sakshi
జనరల్‌ ఆసుపత్రిగా ఛాతీ వైద్యశాల
- ఉస్మానియా నుంచి నాలుగు యూనిట్లు తరలించాలని నిర్ణయం
ఒకటి, రెండు నెలల్లో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి 
 
సాక్షి, హైదరాబాద్‌: ఎర్రగడ్డలోని ఛాతీ వైద్యశాలను జనరల్‌ ఆసుపత్రిగా తీర్చి దిద్దాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా కూకట్‌పల్లి, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావి స్తోంది. అందుకోసం ఉస్మానియా ఆసుపత్రి నుంచి రెండు మెడికల్, రెండు సర్జికల్‌ యూనిట్లను ఛాతీ ఆసుపత్రికి తరలించను న్నారు. ఒకట్రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి ఆమోదించారు. ప్రస్తుతం ఛాతీ ఆసుపత్రిలో 670 పడకలున్నాయి. అయితే టీబీ వ్యాధి రోగులు అంతగా లేకపోవడంతో అందులో నిత్యం 300 పడకల వరకు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో పడకలను ఖాళీగా ఉంచకుండా జనరల్‌ వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఇది అందుబాటులోకి వస్తే ఛాతీ ఆసుపత్రిలో అన్ని రకాల సాధారణ వైద్య సేవలు కూడా పేదలకు అందుతాయి. 
 
టీబీకి ప్రత్యేకం..
1920లో టీబీ వ్యాధి విజృంభించినప్పుడు చికిత్స కోసం హైదరాబాద్‌ వాసులు వికారాబాద్‌ సమీపంలోని అనంతగిరి టీబీ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. అంతదూరం వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేక చాలా మంది  మృత్యువాతపడేవారు. దీన్ని గమనించిన ఏడో నిజాం 1937లో ఇర్రం నుమా ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకుని, అందులో ఛాతీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సుమారు 150 ఏళ్ల క్రితం నిర్మిం చిన ఈ భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలా వస్థకు చేరుకుంది. ఇప్పటికే భవనం పైకప్పు పెచ్చులూడిపడుతోంది. గోడలు బీటలు వారి కూలేందుకు సిద్ధంగా ఉన్నా యి. అయితే ఎలాగోలా వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా  కూకట్‌పల్లి, సనత్‌ నగర్‌ తదితర ప్రాంతాల నుంచి రోగులు ప్రస్తుతం గాంధీ లేదా ఉస్మానియా ఆసు పత్రులకు వైద్యం కోసం వెళుతున్నారు. ఇక రానున్న రోజుల్లో సమీపంలోని ఛాతీ ఆసుపత్రిలోనే ఇతర వైద్య సేవలు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు