ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు

17 Jun, 2016 00:55 IST|Sakshi
ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు

కేంద్ర మంత్రి దత్తాత్రేయ  
* 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎంసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడి
* ఇందులో 35 శాతం సీట్లు కార్మికుల పిల్లలకే

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. వందసీట్లలో ప్రవేశాలకు ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నుంచి గురువారం గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలిపారు.

ఎంసీఐ నుంచి అన్ని అనుమతులు వచ్చేలా కృషి చేసినందుకు మంత్రి దత్తాత్రేయ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ శ్రీనివాస్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో 35% సీట్లను కార్మికుల పిల్లలకే కేటాయిస్తామన్నారు. వంద సీట్లలో 10% ఆలిం డియా కోటాకు, 35% తెలంగాణ కార్మికుల పిల్లలకు, 55% రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తామని వివరించారు.

కార్మిక కోటాలో సీట్లు భర్తీకాకపోతే వాటినీ తెలంగాణ విద్యార్థులకే చెందే లా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన సనత్‌నగర్ మెడికల్ కాలేజీ దేశానికే తలమానికంగా నిలవనుందన్నారు.
 
ఉద్యోగంకోసం 3.60 కోట్లమంది నిరీక్షణ
దేశంలో ఉద్యోగ అవకాశాల కోసం దాదాపు 3.60 కోట్ల మంది నిరీక్షిస్తున్నారని దత్తాత్రేయ వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పోర్టల్‌కు వీరు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అలాగే 9.29 లక్షల కంపెనీలూ ఉద్యోగాలను ఈ పోర్టల్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

దేశవ్యాప్తంగా సుమారు 100 మోడల్ కెరీర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఓయూలో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయానికి ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై మూడో వారంలో సీఐఐ సహకారంతో మెగా జాబ్‌మేళా నిర్విహ స్తామన్నారు.
 
కేంద్రంపై నిందలు సరికాదు
రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రంపై నిందలు వేయడం సమంజసం కాదని దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ‘ఐటీఐఆర్’కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక (డీపీఆర్) ఎందుకు తయారు చేయలేకపోయిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. డీపీఆర్‌ను కేంద్రానికి అందజేస్తే పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సెంటిమెంట్ ఎల్లకాలం పనిచేయదనే విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు గుర్తించాలన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయడం తగదని హితవు పలికారు.

మరిన్ని వార్తలు