నన్ను అలా పిలిచే ఏకైక వ్యక్తి ఆయన: నరసింహన్

14 Jun, 2017 10:07 IST|Sakshi
పూర్తి పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి ఆయన: నరసింహన్

హైదరాబాద్: సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి భౌతిక కాయాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సందర్శించారు. నేటి ఉదయం పుప్పాలగూడ డాలర్‌హిల్స్ లోని సినారె స్వగృహానికి వెళ్లిన గవర్నర్ సాహితీ రేడుకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'నన్ను పూర్తి పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి సినారె. మన మధ్య లేకపోయినా అందరి మనస్సుల్లో ఆయన నిలిచారు. ఓ గొప్ప సాహితీవేత్త. సినారె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని' గవర్నర్ అన్నారు.

సాహితీ లోకానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ కొనియాడారు. 'విశ్వంభర'తో ఎంతో ఉన్నతమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందినా.. ఆయన సామాన్యుడిగానే మెలిగారని పేర్కొన్నారు. తుదిశ్వాస విడిచేవరకూ తన సేవల్ని అందరికీ అందించిన గొప్ప వ్యక్తుల్లో సినారె ఒకరని చెప్పారు. కాగా, నేడు మహాప్రస్థానం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంచనాలతో సినారె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకుముందు తిలక్‌రోడ్డులోని తెలంగాణ సారస్వతపరిషత్తులో ఉదయం 9  నుంచి 10 గంటల వరకు కవులు, రచయితల సందర్శనార్ధం సాహితీ దిగ్గజం భౌతికకాయాన్ని ఉంచారు. ప్రముఖులు సినారెకు తుది నివాళులర్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు