తడిసిన ధాన్యం 1.16 లక్షల టన్నులు

5 May, 2018 01:18 IST|Sakshi

91 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం

అందులో 42,500 ఎకరాల్లో నేలరాలిన మామిడి

అకాల వర్షాలతో నష్టంపై వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అంచనాలు

పరిస్థితిని సమీక్షించిన మంత్రి ఈటల రాజేందర్‌

తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లులకు తరలించాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా 1.16 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. దీనిపై జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా తడిసిన ధాన్యాన్ని తక్షణమే రైస్‌ మిల్లులకు తరలించే ప్రక్రియ చేపట్టింది.

ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూసే పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అకాల వర్షాలకు తడిసిన ధాన్యం తరలింపుపై శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్షించారు. అలాగే సంబంధిత అధికారులు, రాష్ట్ర రైస్‌ మిల్లర్లతో పౌర సరఫరాల కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ సమావేశమయ్యారు.

ప్రత్యేక అధికారుల నియామకం..
ప్రాథమిక అంచనా ప్రకారం మంచిర్యాల, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం తదితర జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ యార్డుల వద్ద సుమారు 1.16 లక్షల టన్నుల ధాన్యం తడిసిందని.. ఆ ధాన్యాన్ని తక్షణం రైస్‌ మిల్లులకు తరలించాలని అకున్‌ సబర్వాల్‌ ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తరలింపు, గన్నీ బ్యాగులు, రవాణా తదితర అంశాలను పర్యవేక్షించడానికి పాతజిల్లాల ప్రకారం సీనియర్‌ డీసీఎస్‌వోలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వారితో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై సూచనలు చేశారు.

వరి, మామిడికి తీవ్ర నష్టం
38,417 ఎకరాల్లో ఇంకా కోత దశలోనే ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్‌ తెలిపారు. 430 ఎకరాల్లో మొక్కజొన్న, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయని వివరించారు.

ఇక 52,500 ఎకరాల్లో మామిడి, నిమ్మ, బొప్పాయి, అరటి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు ఉద్యాన శాఖ అంచనా వేసింది. అందులో 42,500 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్టు పేర్కొంది. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు రూ.38 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేసినట్టు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధు తెలిపారు.  


ఫిర్యాదుల కోసం వాట్సాప్‌ నంబర్‌
అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పౌర సరఫరాల కమిషనర్‌ కార్యాలయంలో జాయింట్‌ కమిషనర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌) ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల కోసం పౌర సరఫరాల శాఖ వాట్సాప్‌ నంబర్‌ 7330774444ను ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా స్థాయిలోనూ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసుకోవాలని అకున్‌ సబర్వాల్‌ ఆదేశించారు.

తడిసిన ధాన్యానికి సంబంధించిన సమాచారం, కనీస మద్దతు ధర, కొనుగోళ్లు తదితర సమాచారాన్ని రిజిస్టర్‌లో రికార్డు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ, ఆర్‌టీఏ అధికారులతో సమన్వయం చేసుకుని కొనుగోలు కేంద్రాల నుంచి తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. తక్షణ చర్యలుగా కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

తడిసిన ధాన్యాన్ని దగ్గరలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించి, వెంటనే బాయిలర్‌లో డంప్‌ చేసి మరింత పాడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల పౌర సరఫరాలు, ఎఫ్‌íసీఐ అధికారులతో పాటు స్థానిక జిల్లా రైస్‌ మిల్లర్లతో కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసి ధాన్యం త్వరితగతిన అన్‌లోడ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా