‘ఆ ఫ్యామిలీ అవినీతిలో ఏనుగులా బలిసింది’

3 Nov, 2016 16:16 IST|Sakshi
‘ఆ ఫ్యామిలీ అవినీతిలో ఏనుగులా బలిసింది’
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతిలో ఏనుగులా బలిసిందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కాపలా కుక్కల్లా అవినీతి ఏనుగు వెనకాల వెంటపడతాయన్నారు. అనినీతి, రైతుల ఆత్మహత్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం నెం 1 గా ఉందన్నారు. గ్రేటర్‌లో జరిగిన అవినీతిపై కేసీఆర్, కేటీఆర్‌లు ఎందుకు స్పందించలేదన్నారు. రూ.337 కోట్ల రోడ్ల నిర్మాణంలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. జీహెచ్‌ఎంసీ కుంభకోణంపై లోకాయుక్తలో కేసు వేయబోతున్నామన్నారు.
 
అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయన్నారు. ‘కేటీఆర్ మంత్రి అయ్యాక తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? కేటీఆర్ కేమాన్ ఐలాండ్ వెళ్లింది అవినీతి సొమ్మును దాచుకోవడానికేనా? జూబ్లీ 800 పబ్ నిర్వాహకులకు మీకు సంబంధం ఏంటి ?అన్ని బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మిషన్ భగీరథ లో ఎందుకు ఖర్చు చేస్తోంది..కమీషన్ల కోసమేనా?’  అని ప్రశ్నించారు. పేదల డబుల్ బెడ్‌రూంలకు డబ్బుల్లేవు కానీ..రూ. 50 కోట్లతో కేసీఆర్ ఇల్లు మాత్రం కట్టుకున్నారని అన్నారు.
మరిన్ని వార్తలు