మెరుగవుతున్న దాసరి ఆరోగ్యం

2 Feb, 2017 06:33 IST|Sakshi
మెరుగవుతున్న దాసరి ఆరోగ్యం

పరామర్శించిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్
సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కోలుకుంటున్నారు. అన్నవాహికకు ఇన్ ఫెక్షన్  సోకడంతో ఆయనను మూడు రోజుల కిందట సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితంతో పోలిస్తే బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, ఊహించిన దానికంటే ఎక్కువగా చికిత్సకు స్పందిస్తున్నట్లు కిమ్స్‌ ఎండీ, సీఈవో డాక్టర్‌ భాస్కర్‌రావు ప్రకటించారు. దాసరి త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మూత్ర పిండాల పనితీరు మెరుగుపడటంతో డయాలసిస్‌ నిలిపివేసినట్లు తెలిపారు.

అయితే మరో 24 గంటలపాటు సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నటుడు మోహన్  బాబు మాట్లాడుతూ.. క్లిష్టమైన ఆపరేషన్ ను కిమ్స్‌ వైద్యులు విజయవంతంగా చేశారని, దాసరి పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం షిర్డి వెళ్లి తన గురువు కోసం బాబాకు పూజలు చేసి వస్తానని చెప్పారు. ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ కూడా ఆస్పత్రికి వచ్చి దాసరి ఆరోగ్యంపై వాకబు చేశారు.

వైఎస్‌ జగన్  పరామర్శ
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దాసరిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లా డి ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న మోహన్  బాబు, ఆయన కుటుంబ సభ్యులతో దాసరి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆస్పత్రి ఎండీ భాస్కర్‌రావుతో మాట్లాడి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు, ప్రస్తుత పరిస్థితి ఏమి టి, ఎన్ని రోజుల్లో కోలుకుంటారనే విషయా లను అడిగి తెలుసుకున్నారు. జగన్  వెంట వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అధికార ప్రతినిధి అరుణ్‌ కుమార్, నాయకుడు కాసు మహేశ్‌రెడ్డి కూడా ఉన్నారు.

దాసరి త్వరగా కోలుకోవాలి: పవన్
దాసరి నారాయణరావును సినీనటుడు పవన్ కల్యాణ్‌ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చి దాసరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాసరి పూర్తిగా కోలుకుంటారనే నమ్మకంతో వైద్యులు ఉన్నారని, గురువారం వెంటిలేటర్‌ తొలగిస్తామని చెప్పారని తెలిపారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పవన్ తోపాటు దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్, నిర్మత్‌ శరత్‌ తదితరులు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కూడా దాసరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు