భూ రికార్డులు సరిచేస్తారిలా...

2 Aug, 2017 02:10 IST|Sakshi
భూ రికార్డులు సరిచేస్తారిలా...
- గ్రామం యూనిట్‌గా మొదలైన పత్రాల పరిశీలన
సీలింగ్‌ భూముల స్వాధీన వివరాల నమోదు
చనిపోయిన వారి పేర్ల గుర్తింపు
ఆగస్టు 10 నాటికి ప్రక్రియ పూర్తవడం కష్టమే! 

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన (ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌) కోసం రెవెన్యూ యంత్రాంగం భారీ కసరత్తు చేస్తోంది. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని రికార్డులను పరిశీలించే ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామాల్లో అన్ని రకాల భూముల వివరాల పరిశీలనకు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చోట్ల ప్రత్యేక అధికారులనూ నియమించుకుంటున్నారు. ఆగస్టు 10 నాటికి రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించినా పలు కారణాల వల్ల ఈ ప్రక్రియ జాప్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
– సాక్షి, హైదరాబాద్‌
 
► సేత్వార్, ఖాస్రా, చెస్సలా, ప్రస్తుత పహాణీల్లో ఉన్న భూమిలో సరిపోలని సర్వే నంబర్ల గుర్తింపు. డబుల్‌ ఎంట్రీలు, క్రయ విక్రయ లావాదేవీలు, క్లరికల్‌ తప్పుల సవరణ. ఆపై వెబ్‌ల్యాండ్‌లో నమోదు. ఒకవేళ సవరణ వీలుకాకుంటే అందుకుగల కారణాల గుర్తింపు.
► మీ–సేవ కేంద్రాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా జరిగే మ్యుటేషన్‌ల పరిశీలన. పెండింగ్‌ మ్యుటేషన్‌లకుగల కారణాల నమోదు.
► ప్రభుత్వ భూసేకరణ కింద పరిహారం చెల్లించాక రెవెన్యూ రికార్డుల్లో సంబంధిత రైతులు లేదా పట్టాదారుల వివరాల సవరణ ప్రక్రియ పూర్తిగా జరిగిందా లేదా అని పరిశీలన.
► ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వమే భూమిని కొనిచ్చాక రికార్డుల సవరణ జరిగిందా లేదా అని తనిఖీ.
► వివాదాల్లోని ఇనాం భూములకు పరిష్కారం లభించిందా లేదా అని పరిశీలన. ఒకవేళ లేకుంటే అందుకుగల కారణాల నమోదు.
► ఆంధ్రప్రదేశ్‌ భూ నియంత్రణ చట్టం–1973 ప్రకారం ప్రభుత్వానికి స్వాధీనపడిన వ్యవసాయ/ అర్బన్‌ సీలింగ్‌ భూముల వివరాల నమోదు పూర్తిస్థాయిలో పరిశీలన.
► భూదానోద్యమం ద్వారా ఎన్ని ఎకరాల భూమి ప్రభుత్వానికి దఖలు పడింది. అందులో ఎన్ని ఎకరాలకు రికార్డులున్నాయి.. లేని భూములకు ఎందుకు రికార్డులు నమోదు చేయలేదో ఆరా తీస్తారు. దేవాదాయ, వక్ఫ్‌ భూముల రికార్డులూ క్షుణ్ణంగా తనిఖీ.
► పట్టాదారులుగా ఉండి చనిపోయిన వారికి సంబంధించిన రికార్డులు అప్‌డేట్‌ అయ్యాయా... వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో వాటి నమోదుపై పరిశీలన.
► పహాణీల నుంచి చనిపోయిన వారి పేర్లు తొలగింపు పెండింగ్‌లో ఉంటే అందుకుగల వివరాల సేకరణ. ప్రభుత్వ, ఇతర అసైన్డ్‌ భూముల కబ్జాలో ఉండి చనిపోయిన వారి రికార్డుల అప్‌డేట్‌ జరిగిందా? ఒకవేళ తొలగించని పక్షంలో అందుకుగల కారణాల నమోదు.
► వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వివరాల్లో పట్టాదారు, అనుభవదారుని కాలమ్‌లలో తేడాలుంటే గుర్తింపు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం వాటి సవరణ. 
► గ్రామాల్లో చెరువుల సంఖ్య, చెరువు శిఖం భూముల వివరాలు ఒరిజనల్‌ రికార్డుల్లో ఉన్నాయా లేవా అని పరిశీలన. నాలా, పట్టాశిఖం భూముల వివరాలు పహాణీలో నమోదు చేశారా లేదా తనిఖీ.
► రెవెన్యూ క్లస్టర్‌లో వీఆర్‌వో కార్యాలయం ఉందా లేదా? లేకుంటే అందుకుగల కారణాల నమోదు.  
మరిన్ని వార్తలు