కల్తీపై ‘పిడి’కిలి!

28 Jan, 2018 03:08 IST|Sakshi

     ‘ఆహార నియంత్రణ’ పటిష్టానికి ప్రభుత్వం చర్యలు 

     కల్తీ బాధ్యులపై పీడీ చట్టం ప్రయోగం 

     పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: ఆహార కల్తీ బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆహారాన్ని కల్తీ చేసి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేవారిపై పీడీ చట్టం ప్రయోగించాలని నిర్ణయించింది. ఆహార నియంత్రణ విభాగాన్ని పటిష్టం చేయాలని భావిస్తోంది. ఆహార నాణ్యతా నియంత్రణ విభాగం సిబ్బంది కొరతతో అవస్థలు పడుతోంది. కనీసం ఆహార నమూనాలను సేకరించే పరిస్థితి కూడా లేదు. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాల ప్రకారం నగరాలు, పట్టణాల్లో ప్రతి 50 వేల మంది జనాభాకు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష మంది జనాభాకు ఒకరు చొప్పున ఆహార నియంత్రణ అధికారి ఉండాలి. ప్రతి జిల్లాలో కనీసం ముగ్గురు అధికారులు ఉండాలి.  

15 జిల్లాల్లో నియంత్రణ అధికారుల్లేరు... 
రాష్ట్రవ్యాప్తంగా కేవలం 18 మంది ఆహార నియంత్రణ అధికారులున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ముగ్గురు, 15 జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. మరో 15 జిల్లాల్లో ఆహార నియంత్రణ విభాగమేలేదు. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఇప్పుడు ఆహార ఉత్పత్తుల తయారీ విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో ఆహార కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. ఏది కల్తీయో, ఏదీ నాణ్యమైన పదార్థమో తెలియని పరిస్థితి ఉంది. కల్తీ నియంత్రణ దాదాపు లోపించింది. ఆహార కల్తీపై ఇటీవల హైకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీ నియంత్రణకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నారో తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనవరి 23న దీనిపై హైకోర్టుకు నివేదించాల్సి ఉండగా వాయిదా పడింది. హైకోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలియక వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు పాలుపోవడంలేదు. పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఏడాది క్రితమే ప్రతిపాదనలు రూపొందించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో పోస్టులన్నీ ఖాళీగానే ఉంటున్నాయి.  

ఆహార నియంత్రణ అధికారి ఉన్న జిల్లాలు 
గ్రేటర్‌ హైదరాబాద్‌(ముగ్గురు), వరంగల్‌ అర్బన్, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌.

>
మరిన్ని వార్తలు