టీజేఎస్‌ సభకు అనుమతి నిరాకరణపై వివరణ ఇవ్వండి

11 Apr, 2018 02:31 IST|Sakshi

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

విచారణ 16కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఈ నెల 29న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి నిరాకరించడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం/పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఏర్పాటు చేసిన టీజేఎస్‌ పార్టీ ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. సీతారామమూర్తి విచారించారు.

టీజేఎస్‌ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ సరూర్‌నగర్‌ స్టేడియంలో సభకు అనుమతి ఇవ్వకపోతే ఎన్టీఆర్‌ స్డేడియం లేదా ఎల్బీ స్టేడియంలోనైనా సభ జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో 29న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సభను నిర్వహించుకుంటామని చెప్పారు. అన్ని విధాలుగా హామీ ఇస్తున్నా సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు.

తాము సభ నిర్వహిస్తామంటే పోలీసులు ఏదో ఒక సాకు చెప్పి నిరాకరించడం పరిపాటిగా మారిందని, చివరి వరకూ కాలయాపన చేసి ఆపై పోలీసులు అనుమతి ఇస్తే తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పడం సర్వసాధారణమైందని ఆమె విమర్శించారు. ఎల్బీ స్టేడియంలో సినిమా ఫంక్షన్లకు, ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవాలు, డ్వాక్రా మేళాల నిర్వహణకు అనుమతి ఇస్తున్నారని తెలిపారు. టీజేఎస్‌ సభకు అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని రచనారెడ్డి కోరారు. పిటిషనర్‌ అభ్యర్థనపై ప్రభుత్వ/పోలీసుల వివరణ చెప్పాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు