పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బెర్తులు

28 Mar, 2014 05:11 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో  అదనపు బెర్తులను  ఏర్పాటు చేసినట్లు  దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో  తెలిపారు. దీంతో  47,820 బెర్తులు  ప్రయాణికు లకు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. వెయిటింగ్ లిస్ట్  ప్రయాణికుల డిమాండ్ మేరకు ఈ  ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీటిలో 6,716 సెకెండ్ ఏసీ, 31,744 థర్డ్ ఏసీ, 9,360 స్లీపర్ క్లాస్ బెర్తులు ఉన్నట్లు  పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్-ముంబై మధ్య నడిచే  బై వీక్లీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-షాలిమార్ ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు, సికింద్రాబాద్-నిజాముద్దీన్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 28 వరకు, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే దురంతో ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఏప్రిల్ 2 నుంచి మే 1వ తేదీ వరకు అదనపు బెర్తులు అందుబాటులో ఉంటాయి.
 
  సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 29 వరకు, సికింద్రాబాద్-తిరుపతి బై వీక్లీ ఎక్స్‌ప్రెస్,సికింద్రాబాద్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లలో ఏప్రిల్ 1 నుంచి  మే 1 వరకు, సికింద్రాబాద్-దర్బంగా బై వీక్లీ, సికింద్రాబాద్-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి-కరీంనగర్ బై వీక్లీ, బికనూర్-సికింద్రాబాద్ బైవీక్లీ, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, తదితర రైళ్లలో ఏప్రిల్ మొత్తం  అదనపు బెర్తులు అందుబాటులో ఉంటాయి. కాచిగూడ-చిత్తూరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్,కాచిగూడ-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-చెన్నై ఎగ్‌మూర్ ఎక్స్‌ప్రెస్,కాకినాడ-చెన్నై ఎగ్‌మూర్, కాచిగూడ-మంగళూర్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-సాయినగర్ ట్రై వీక్లీ, కాకినాడ-భావ్‌నగర్ ట్రై వీక్లీ, సికింద్రాబాద్-రాజ్‌కోట్ మధ్య నడిచే బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోను ఏప్రిల్ 1 నుంచి మే 1వ తేదీ  వరకు  అదనపు  బెర్తులు ఏర్పాటు చేస్తారు.

మరిన్ని వార్తలు