భార్యే సూత్రధారి

12 Oct, 2015 00:55 IST|Sakshi

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే..
సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్
వీడిన వ్యాపారిపై హత్యాయత్నం కేసు మిస్టరీ
భార్యతో పాటు మరో నలుగురి అరెస్టు

 
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో రెండు రోజుల క్రితం పట్టపగలు రోడ్డుపై ఓ వ్యాపారిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మరికొందరితో కలిసి భార్యే అతడిని చంపేందుకు యత్నించిందని తేల్చారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... జూబ్లీహిల్స్ గాయత్రీ హిల్స్‌లో నివాసం పతంగిరాము, అంజలి (32) నివాసం ఉంటున్నారు. రాము రాజరాజేశ్వరి ఔట్‌డోర్ యూనిట్ పేరుతో సినిమా షూటింగ్‌లకు జనరేటర్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన అంజలిని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకుని వెంకటగిరిలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, తమ రాజరాజేశ్వరి యూనిట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న వెలవలేటి దుర్గ(24) అనే యువకుడితో అంజలి మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చి ప్రియుడితో కాపురం పెట్టాలని ఆమె భావించింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లో ఉండే తన సన్నిహితుడు ముక్కు కార్తీక్ ఫణీందర్(29)ను పది రోజుల క్రితం సంప్రదించింది. సుపారీ తీసుకుని హత్య చేసే వ్యక్తి ఉన్నాడని, అతడితో ఫోన్‌లో మాట్లాడిస్తానని కార్తీక్  చెప్పాడు. అతను చెప్పినట్టే మంగళహాట్ ఇందిరానగర్‌కు చెందిన కొలుసునూరి రాకేష్(24) అనే బౌన్సర్ అంజలికి ఫోన్ చేసి.. రూ. 5 లక్షలు ఇస్తే నీ భర్తను హత్య చేస్తానన్నాడు. ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించిన అంజలి... అడ్వాన్స్‌గా అతడికి రూ.15వేలు ఇచ్చింది. తన స్నేహితుడు అవినాష్ (19)తో కలిసి రెండు రోజుల పాటు రాము కద లికలపై రాకేష్
రెక్కీ నిర్వహించాడు.  
 
నెల 8వ తేదీ సాయంత్రం రాము స్కూల్‌నుంచి పిల్లల్ని తీసుకురావడ ం కోసం వెళ్తుండగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలకు గురైన రాము వారి నుంచి తప్పించుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. ఫిర్యాదును అందుకున్న జూబ్లీహిల్స్ సీఐ సామల వెంకటరెడ్డి, ఎస్సై శ్రీనివాస్ దర్యాప్తు చేసి కేసులోని మిస్టరీని ఛేదించారు.  నిందితురాలు అంజలితో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డ రాకేష్, అవినాష్,  కార్తీక్, అంజలి ప్రియుడు దుర్గను అరెస్ట్ చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు