అమ్మాయి పేరిట చాటింగ్‌.. ఆపై దాడులు!

16 Dec, 2015 19:06 IST|Sakshi
అమ్మాయి పేరిట చాటింగ్‌.. ఆపై దాడులు!

ఫేస్‌బుక్‌ పరిచయాలు స్నేహాలే కాదు కుటుంబాల మధ్య తగదాలు పెడుతున్నాయి. బంధువులనే బద్ధ శత్రువులుగా మారుస్తున్నాయి. అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ తెరిచి.. బంధువుల అబ్బాయికే గాలం వేశాడు ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి. ఆ అమ్మాయి స్నేహంలో నిండా మునిగి.. ఆ తర్వాత అసలు సంగతిని తెలుసుకొని నిశ్చేష్టుడయ్యాడు పదో తరగతి చదువుతున్న ఆ అబ్బాయి. ఈ గొడవ చినికిచినికి గాలివానగా మారి ఇరు కుటుంబాలు పర్సపరం దాడులకు దిగాయి. చివరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి పరస్పరం  కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది వ్యవహారం.

వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ హకీంపేటకి చెందిన 8 తరగతి విద్యార్థి(16) రెండు నెలల క్రితం జామియా నాజ్ అనే యువతి పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచాడు. తన ఇంటి సమీపంలోనే ఉన్న పదో తరగతి విద్యార్థి(16)ని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని గత నెల 8 నుంచి చాటింగ్ చేస్తున్నాడు. తాను మాట్లాడుతున్నది యువతితోనే అన్న భ్రమలో ఆ అబ్బాయి ఉండిపోయాడు. ఆ పరిచయం కాస్తా శృతిమించింది. ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకోవాలనే దాకా వెళ్లింది.

 అమ్మాయి పేరుతో అకౌంట్‌ తెరిచిన విద్యార్థి 'నేను మీ అక్కను ప్రేమిస్తున్నాను' అంటూ ట్విస్ట్‌ ఇచ్చాడు. ఆ మెసేజి చూసి పదో తరగతి విద్యార్థికి అనుమానం వచ్చింది. అతడు అమ్మాయి కాదని నిర్ధారించుకునేందుకు.. ఇద్దరం మాట్లాడుకుందాం రమ్మంటూ ఈ నెల 11న బయటకు పిలిచాడు. తీరాచూస్తే తన ఇంటిపక్కనే నివసిస్తున్న బంధువుల అబ్బాయే  అతని అని తేలింది. దీంతో ఆ పదో తరగతి బాలుడు అవాక్కయ్యాడు.

ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. అదే రోజు రాత్రి పదో తరగతి విద్యార్థి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. అనంతరం పరస్పరం దాడులకు దిగారు. తన కొడుకును అమ్మాయి పేరుతో మోసం చేసి ఇంటిపై దాడి చేశారని, తమతో అసభ్యంగా ప్రవర్తించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎజాజ్, పర్వేజ్, షేక్ జిషాన్, షేక్ తాహుర్, నిఖత్, ఆరీఫా, జీనత్ లపై కేసు నమోదు చేశారు.

 అయితే తమపై కూడా దాడి చేశారంటూ అవతలివైపు వారు కూడా ఫిర్యాదు చేయటంతో సొహైల్, షకీల్, మహ్మద్, సయ్యద్ సాహిల్ తదితరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులు రికార్డు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు