ట్రూ కాలర్‌ యాప్, ఫేస్ బుక్ లు పట్టించేశాయి..

4 Mar, 2016 20:03 IST|Sakshi

హైదరాబాద్ : మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో జరిగిన రూ.1.21 లక్షల విలువైన రాడో వాచ్ చోరీ కేసును పోలీసులు ఫేస్‌బుక్, ట్రూ కాలర్ యాప్, సీసీ కెమెరాల సాయంతోనే చేధించారు. సాధారణ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సింపుల్ ఇన్వెస్టిగేషన్ చేసిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శశాంక్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి గురువారం నిందితుల్ని అరెస్టు చేయగలిగారు.

సరదాగా వచ్చి చోరీ చేసి...
కూకట్‌పల్లికి చెందిన బీటెక్ విద్యార్థులు ఆర్.సుహాస్ చౌదరి, జి.తేజ గత నెల 9న మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌కు వెళ్లారు. అటూ ఇటు తిరిగిన ఈ ద్వయం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాల్‌లో ఉన్న ఇతోస్ వాచ్ స్టోర్‌లోకి ప్రవేశించారు. కొద్దిసేపు వాచీలను ఖరీదు చేసే నెపంతో పరిశీలించారు. షాపు యజమాని మరో వినియోగదారుడితో మాట్లాడుతుండగా.. అదను చూసి రూ.1.21 లక్షల విలువైన రాడో కంపెనీ వాచ్‌ను తస్కరించారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ నుంచి జారుకున్న ద్వయం తమ బైక్‌పై మాదాపూర్ వైపు వెళ్లిపోయారు. తన దుకాణంలో వాచ్ చోరీకి గురైందని గుర్తించిన యజమాని అదే రోజు మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ప్రాథమిక ఆధారాలిచ్చిన సీసీ కెమెరాలు...
ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన ఇన్‌స్పెక్టర్ శశాంక్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రాథమికమైన ఆధారాలపై దృష్టి పెట్టింది. తొలుత మాల్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుల ఫుటేజ్ సేకరించింది. ఎంట్రీ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఇద్దరూ ఓ క్యారీబ్యాగ్ తీసుకుని లోపలకు వచ్చినట్లు రికార్డయ్యింది. మాల్‌కు సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులూ పల్సర్ వాహనంపై వచ్చి వెళ్లినట్లు వెల్లడైంది.

యాప్స్, సోషల్ మీడియా ద్వారా క్లూస్...
సీసీ టీవీ ఫీడ్‌లో ఉన్న వాహనం నంబర్‌ను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఆర్టీఏ అధికారుల సాయంతో రిజిస్టర్ అయి ఉన్న చిరునామా, రికార్డుల్లో పొందుపరిచిన సెల్‌ఫోన్ నంబర్ సేకరించారు. అయితే వాహనాన్ని ప్రస్తుతం రిజిస్టర్ చేసుకున్న యజమాని (నిందితుడు) వినియోగిస్తున్నాడా? చేతులు మారిందా? అనే అంశాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారి యాప్స్, సోషల్ మీడియాలను ఆశ్రయించారు.

ఆ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా మొబైల్ యాప్ ట్రూ కాలర్‌లో, ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న పేరును సోషల్ మీడియా ఫేస్‌బుక్స్‌లో సెర్చ్ చేశారు. వాటిలో ఉన్న ఫొటో, సీసీ కెమెరా ఫీడ్స్‌లో నమోదైన ఫీడ్‌లోని దాంతో సరిపోలడంతో అతడే నిందితుడిగా గుర్తించారు. గురువారం నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేసి ఇద్దరినీ అరెస్టు చేయడంతో పాటు వాచ్ రికవరీ చేశారు.
 

మరిన్ని వార్తలు