రూ. 80 వేలకే ఇంజనీరింగ్ సర్టిఫికెట్!

22 Oct, 2016 19:14 IST|Sakshi
రూ. 80 వేలకే ఇంజనీరింగ్ సర్టిఫికెట్!
పదో తరగతి నుంచి ఇంజనీరింగ్, పీజీ వరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా.. ఏ యూనివర్సిటీ నుంచి కావాలన్నా నిమిషాల్లో తెప్పిస్తాడు.. కాదు, ముద్రిస్తాడు. కేవలం రూ. 80వేలు పెడితే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఇలా నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తూ పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టుచేశారు. మహ్మద్ జుమైర్ అలియాస్ జుబైర్ అలియాస్ హుస్సేన్ (43) ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇతడు మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్, మదురై కామరాజ్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ స్టడీస్, ఛత్రపతి సాహూజీ మహరాజ్ యూనివర్సిటీ, కాన్పూర్, సత్యభామ యూనివర్సిటీ, డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ యూనివర్సిటీ ఆగ్రా, మానవ్ భారతి యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓఖ్లా, ఢిల్లీ, వినాయక మిషన్స్ యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ మధ్య భారత్ గ్వాలియర్, గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ లాంటి సంస్థల పేరు మీద నకిలీ డిగ్రీలను సప్లై చేసేవాడు. అతడి వద్దనుంచి వివిధ వర్సిటీలకు చెందిన 60 నకిలీ సర్టిఫికెట్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక కలర్ ప్రింటర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
2011 సంవత్సరంలో మహ్మద్ జుమైర్ క్విక్ జాబ్ సొల్యూషన్స్ అనే కన్సల్టెన్సీని మలక్‌పేట సమీపంలోని సిటీటవర్స్‌లో ప్రారంభించాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి చివరకు దుకాణం ఎత్తేశాడు. తర్వాత 2015లో హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ పేరుతో సంతోష్‌నగర్‌లోని చంపాపేట రోడ్డులో మరో దుకాణం తెరిచాడు. అక్కడ వ్యాపారం బాగోకపోవడంతో పంజాగుట్ట మోడల్‌ హౌస్ ప్రాంతానికి మార్చాడు. అక్కడ ఎ. హరిబాబుతో కలిసి వివిధ యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసేవాడు. బషీర్‌బాగ్ లోని బాబూఖాన్ ఎస్టేట్‌లో మరో ఆఫీసు తెరిచి, దాని బాధ్యతలు హరిబాబుకు ఇచ్చాడు.

వన్ సిట్టింగ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ కోర్సుల పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, అక్కడకు వచ్చినవారి నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని వాళ్లతో పరీక్షలు రాయించకుండానే ఈ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. సుదూర ప్రాంతాల్లో ఉన్న బ్రోకర్లతో కూడా ఇతడికి సంబంధాలుండేవి. వాళ్లకు విద్యార్థుల వివరాలు వాట్సప్ ద్వారా పంపితే వాళ్లు కొరియర్‌లో సర్టిఫికెట్లు పంపేవారు. ఇంజనీరింగ్‌కు రూ. 80వేలు, ఎంబీఏ కావాలంటే రూ. 40 వేలు, ఎంసీఏకు రూ. 50వేలు, డిగ్రీకి రూ. 40వేలు, ఇంటర్‌కు రూ. 15వేలు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. ఇలా ఇప్పటివరకు 80-100 మందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఇతగాడు పోలీసులకు చిక్కాడు. 
>
మరిన్ని వార్తలు