కోసేస్తారు..తీసేస్తారు..!

30 Aug, 2016 19:55 IST|Sakshi
కోసేస్తారు..తీసేస్తారు..!

ఎంబీబీఎస్ చదవక పోయినా వారు డాక్టర్లుగా చెలామణీ అవుతున్నారు. పేరు ముందు డాక్టర్ అని బోర్డు తగిలించుకుని అబార్షన్లు, హెర్నియా, గర్భసంచి తొలగింపు వంటి శస్త్రచికిత్సలు చేస్తూ అనేక మంది మరణానికి కారణమవుతున్నారు.  హైదరాబాద్‌లోనే ఇలాంటి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు గల్లీకొకరు వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
 
హైదరాబాద్:  గ్రేటర్ పరిధిలో 1804 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు ఉండగా వీటిలో కేవలం 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో ఐదు వేలకుపైగా క్లీనిక్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 1200 వరకు ఉన్నాయి. మిగిలినవన్నీ శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో  ఏ ఒక్క దానికి అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా క్లీనిక్‌లు నడుపుతూ ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్న కొంత మంది ఆర్‌ఎంపీలను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకున్న వారిపై కేసులు నమోదు చేయడం విశేషం.

 హెర్నియా నుంచి అబార్షన్ల వరకు:
బస్తీల్లోని నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వీరు గైనకాలజిస్టులుగా, జనరల్ ఫిజిషయన్స్‌గా, జనరల్ సర్జన్స్‌గా చలామణి అవుతున్నారు. హెర్నియా, అపెండిసైటీస్, అబార్షన్లు, గర్భసంచి తొలగింపు తదితర ఆపరేషన్లు చేస్తున్నారు. కొన్నిసార్లు అధిక రక్తస్త్రావం వల్ల రోగులు మృత్యువాతపడుతున్నారు.

నగరంలోని చార్మినార్, బార్కాస్, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, కంచన్‌బాగ్, బీఎన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, భూపేష్‌గుప్తానగర్, నందనవనం, మీర్‌పేట్, హస్తినాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం, మన్సూరాబాద్, బండ్లగూడ, బోడుప్పల్, రాజేంద్రనగర్, మల్కజ్‌గిరి, మాణికేశ్వరినగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదులు అందగా, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాడులు నిర్వహించి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా వారు స్వయంగా డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు నడుపుతున్నారు. వీటికి ఎలా ంటి అనుమతులు లేకపోవడం కొసమెరుపు.

మచ్చుకు కొన్ని ఘటనలుః
ఫిలింనగర్ దుర్గాభవానీనగర్‌లో ఓ నర్సింగ్‌హోంలో గర్భవతికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో శిశువుకు జన్మనిచ్చి మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ నర్సు గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నట్లు చెప్పుకుంటూ రోగులకు చికిత్స చేస్తుండగా కంచన్‌బాగ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీరా సదరు మహిళ చదివింది బీఎస్సీనర్సింగ్ అని తెలిసి పోలీసులే నివ్వెర పోయారు. ఇటీవల చాంద్రాయణగుట్ట పరిధిలోని ఓ యునాని వైద్యుడు నొప్పితో బాధపడుతున్న ఓ రోగికి ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి మృతి చెందగా, శవాన్ని మూటలో కట్టి శంషాబాద్ సమీపంలో తగులబెడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన సంచ లనం సృష్టించింది.
 
 లేఖ రాసినా..స్పందన లేదు:

 హైదరాబాద్ జిల్లా పరిధిలో 1804 ఆస్పత్రులు ఉండగా, వాటిలో 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో 1100-1200 క్లీనిక్స్ ఉన్నట్లు గుర్తించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాటికి నోటీసులు జారీ చే శారు. అనుమతుల్లేని వాటికి మంచినీరు, డ్రైనేజీ, కరెంట్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ సహా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు లేఖ రాసినా వారి నుంచి   ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఆర్‌ఎంపీలు నిర్వహించే క్లీనిక్స్ పై చర్యలు తీసుకునే అధికారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు లేక పోవడంతో వారేమీ చేయలేక పోతున్నారు.
 
 16 మంది నకిలీ ఆర్‌ఎంపీ డాక్టర్లు అరెస్టు
 
వైద్యం పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 16 మంది నకిలీ ఆర్‌ఎంపీలను సైబరాబాద్ ఈస్ట్ ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. షెడ్యూల్డ్ మందులు, ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆర్‌ఎంపీలపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్ ఈస్ట్ ఎస్‌ఓటీ డీసీపీ రాంచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్‌పెక్టర్ కె.నర్సింగరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు ప్రత్యేకంగా ఆస్పత్రులను నిర్వహిస్తుండటం గమనార్హం.
 
 అరెస్టయిన వారి వివరాలు..
 కె.రామలింగయ్య(శ్రీనివాస క్లీనిక్), కాళిదాస్(డాక్టర్ కాళీదాస్ పాలీ క్లీనిక్), కృష్ణమూర్తి( (విజయ పాలీక్లీనిక్)), మోహనాచారి( శ్రీసాయి క్లీనిక్), ఎస్.నరసింహులు(శ్రీ వెంకటసాయి క్లీనిక్),డి.శంకర్, ఎస్‌ఎం హుస్సేన్(అన్సారి క్లీనిక్), ఎం.పవన్‌కుమార్(శ్రీసాయి అక్షర క్లీనిక్), జనార్థనాచారి,డి.చెన్నారెడ్డి( వినిషా క్లీనిక్)లతో పాటు మేడిపల్లి, నాచారంలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోయినా క్లినిక్ లు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు.

మరిన్ని వార్తలు