ఫలక్‌నుమాలో దొంగల బీభత్సం

9 Jan, 2014 06:26 IST|Sakshi
ఫలక్‌నుమాలో దొంగల బీభత్సం

దుకాణదారుడిపై కత్తితో దాడి: నగదు చోరీ

చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: చీకటిమాటున ఫలక్‌నుమాలో దొంగలు తెగబడ్డారు. రాత్రి 9 గంటలకు దుకాణంలో ఒంటరిగా ఉన్న వ్యక్తిపై కత్తితో దాడిచేసి దోపిడీ చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఫలక్‌నుమా బస్‌డిపో ఎదురుగా సయ్యద్ అజీజుద్దీన్ అనే వ్యక్తి ‘ఎక్స్‌ప్రెస్ మనీ’ పేరుతో మనీ ట్రాన్స్‌ఫర్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా, బుధవారం రాత్రి అజీజుద్దీన్ ఇంటికి వెళ్లి వస్తానని దుకాణంలో పనిచేసే బర్కత్ అలీ(24) అలియాస్ ఇమ్రాన్‌కు చెప్పి వెళ్లాడు. అతను వెళ్లిన పది నిమిషాల్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోకి చొరబడ్డారు.

ఇందులో ఒకరు మంకీ క్యాప్ ధరించి ఉండగా, మరొకరు టీ షర్ట్, జీన్స్‌లో ఉన్నాడు. వీరు తమకు డబ్బులు ఇవ్వాలని బర్కత్ అలీని హిందీలో బెదిరించారు. తాను ఇవ్వబోనని చెప్పడంతో కత్తి చూపించి కౌంటర్‌లో ఉన్న నగదును లాక్కొని బయటికి వెళ్లారు. దుకాణం ముందు నుంచి పది అడుగుల వేయగానే వారి వెనుకాలే వచ్చిన బర్కత్ అలీ దొంగలను అడ్డుకొని ప్రతిఘటించాడు. దీంతో రెచ్చిపోయిన దుండగులు కత్తితో బర్కత్ అలీ కడుపులోకి పొడిచేందుకు యత్నిం చారు.

ఆ సమయంలో బర్కత్ అలీ చేతిని అడ్డం పెట్టడంతో ఎడమ చేతికి కత్తి గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే దుండగులు అక్కడి నుంచి ఫలక్‌నుమా డిపో రోడ్డుకు.. అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, దుండగులు ఆటో వాలాకు కూడా కత్తి చూపించి ఆటోలో ఎక్కినట్లు సమాచారం. గాయపడ్డ బర్కత్ అలీ వెంటనే యజమాని సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ తాహేర్ అలీ, ఇన్‌స్పెక్టర్ హుస్సేన్ నాయుడులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించి కేసు నమెదు చేశారు. కాగా పోలీసుల విచారణలో దుకాణంలో రూ.1900 చోరీ అయినట్లు తేలింది.
 
ఘటనా స్థలంలో నకిలీ నంబర్‌తో బైక్
 
మనీ ట్రాన్స్‌ఫర్ కార్యాలయం ముందు ఏపి 13 ఎఫ్ 7262 నంబర్ కలిగిన పల్సర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం నంబర్ ఇంటర్నెట్‌లో పరిశీలించగా అది ప్యాషన్ ప్లస్‌కు సంబంధించిన నంబర్‌గా తేలింది. దీంతో వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, దుండగులు ఇదే వాహనంపై వచ్చి ఉంటారని, వెళ్లే సమయంలో గొడవ జరగడంతో వాహనాన్ని వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని బట్టి దుండగులు పథకం ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 6వ తేదీనా రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. అక్కడ కూడా దుండగులు దుకాణదారుడిని బెదిరించి చోరీకి పాల్పడ్డారు. ఇదే తరహా ఘటన పునరావృతం కావడం పట్ల పాత నగరంలో ఏదైనా ముఠా సంచరిస్తుందా...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు