నగదు కొరతతో అప్పుల ఊబిలోకి రైతులు

16 Jul, 2017 02:24 IST|Sakshi
నగదు కొరతతో అప్పుల ఊబిలోకి రైతులు
- తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరిన టీపీసీసీ బృందం
రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం: ఉత్తమ్‌ 
 
సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకుల్లో నగదు కొరత వల్ల రైతులు అప్పుల ఊబిలోకి పోతున్నారని, రైతును ఆదుకోవడానికి తగిన చర్యలను తీసుకోవాలని గవర్నర్‌కు టీపీసీసీ బృందం విజ్ఞప్తి చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నేతల బృందం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో శనివారం కలిసింది. రైతుల సమస్యలు, నగదు కొరత, నకిలీ విత్తనాల వంటి వాటిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వివరిం చారు. ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పీఏసీ చైర్‌పర్సన్‌ గీతారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రులు డీకే అరుణ, దానం నాగేందర్, టీపీసీసీ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు కోదండ రెడ్డి, మండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు బృందంలో ఉన్నారు.

అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, తమ సొంత ఖాతాల్లోని డబ్బును కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. కూలీలకు ఉపాధి హామీ జీతాలివ్వడం లేదని విమర్శించారు. రుణమాఫీ 4 విడతల్లో చేయడం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, వడ్డీమాఫీ పథకంగా మారిపోయి బ్యాంకులకు ఉపయోగపడిందని విమర్శించారు. రైతుల పంటరుణాలపై వడ్డీభారం ప్రభుత్వమే భరిస్తుందని ఆరు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలోనే హామీ ఇచ్చారని ఉత్తమ్‌ గుర్తుచేశారు. అయినా అమలు కాలేదన్నారు.

నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న కాంగ్రెస్‌ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ హత్య కేసులో స్థానిక కాంగ్రెస్‌ నేత రాజేందర్‌రెడ్డిని అక్రమంగా ఇరికిస్తున్నారని, దీనిపై డీజీపీతో మాట్లాడినట్లు చెప్పారు. కేసు నుంచి రాజేందర్‌రెడ్డి పేరును తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పొంగులేటి మాట్లాడుతూ.. డ్రగ్స్‌ కేసులో సంబంధమున్న వారందరిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.  
మరిన్ని వార్తలు