పాస్ పుస్తకాలు ఉండి తీరాల్సిందే: వైఎస్ జగన్

16 Mar, 2016 09:29 IST|Sakshi
పాస్ పుస్తకాలు ఉండి తీరాల్సిందే: వైఎస్ జగన్

హైదరాబాద్ : రైతులకు పాస్‌ పుస్తకాలు పూర్తిగా తీసేయాలనుకోవడం సరికాదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. రైతులు కనీసం రుణాలు తీసుకోవడానికి, ఇతర అవసరాలకు చేతిలో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉండాలని ఆయన తెలిపారు. కావాలంటే కంప్యూటర్ రికార్డులను సెకండరీ చెక్‌గా పెట్టుకోవాలని, ప్రైమరీ చెక్‌గా పాస్ పుస్తకాలు ఉండాలని అన్నారు.

ప్రభుత్వం తీసుకువస్తామంటున్న ఈ పుస్తకాలతో రైతులకు ఇబ్బందులు తప్పవని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వేళ ప్రభుత్వం అలా చేస్తే మొత్తం వ్యవస్థ అంతా రెవెన్యూ అధికారులు చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. ఎవరైనా హ్యాకింగ్ చేస్తే సదరు భూమికి ఓనర్ ఎవరో కూడా తెలియదన్నారు. భూమికి సంబంధించి ఎదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ... సదరు రైతులు అధికారులను ఆశ్రయించవచ్చని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రికార్డ్గా పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. వాటిని కొనసాగించాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూచించారు.  

వైఎస్ జగన్ చేసినది చాలా మంచి సూచన అని, దాన్ని పాటించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. రైతుల చేతిలో ఫిజికల్ పాస్‌బుక్ తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. కంప్యూటర్లలో మాత్రమే ఉంటాయంటే చాలా సమస్య అవుతుందని చెప్పారు.

దీనికి రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి సమాధానం ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలను పూర్తిగా తీసేయడం లేదని, ఆప్షనల్‌గా చేస్తున్నామని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు