కన్నతండ్రే కాళ్లయ్యాడు..

19 Jun, 2016 19:26 IST|Sakshi
కన్నతండ్రే కాళ్లయ్యాడు..

‘నన్ను 20 ఏళ్లుగా తన భుజస్కంధాలపై మోస్తున్నాడు నాన్న. ప్రస్తుతం ఐసెట్ రాశాను. గ్రూప్-2కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి నా కోసం సర్వం ధారపోసిన తండ్రి రుణం తీర్చుకుంటానంటోం’ది తేజస్విని. రాంనగర్లోని బాప్టిస్టు చర్చి సమీపంలో నివాసముండే ముజ్జి వెంకటేశ్వరరావు, రమాదేవిల కూతురు తేజస్విని.

ఈమెకు పుట్టుకతోనే పోలియో సోకడం తో కదల్లేని పరిస్థితి. కాలు ఇంటి బయట పెట్టాలన్నా సపోర్ట్ కావాల్సిందే. చిన్నప్పుడు హయత్నగర్లోని ఓ స్కూల్లో చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను రోజూ స్కూల్లో వదిలి వచ్చేవారు. రాంనగర్ సెయింట్ పాయిస్లో ఇంటర్ చేసినప్పుడు తరగతి గది మూడో అంతస్తులో ఉండటంతో తండ్రి వెంకటేశ్వరరావు కూతురును ఎత్తుకొని వెళ్లి, ఎత్తుకొచ్చేవారు. రెండేళ్లు రోజూ ఇదే విధంగా చేశారు. మారేడ్పల్లిలోని కస్తూర్భా మహిళా డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో చదివినప్పుడు మూడేళ్లు కూడా తరగతి గదిలో కూర్చోబెట్టి వచ్చేవారు.

అన్ని పనులు మానుకొని కూతురికే అత్యధిక సమయం వెచ్చించడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. అయినా పట్టించుకోలేదు. ఆమె కోసం ఆటో కొని అందులో పాపను తీసుకువెళ్లి, తీసుకొచ్చేవారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పాపను తన భుజాలపై మోసుకుంటూ తరగతి గదిలో కూర్చొబెట్టిన వెంకటేశ్వరరావును కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ‘బీయింగ్ ఎగ్జామ్ప్లరీ పేరెంట్స్’ పేరుతో సత్కరించారు కూడా.

మరిన్ని వార్తలు