పీల్.. ప్లీ

17 Oct, 2015 00:36 IST|Sakshi
పీల్.. ప్లీ

ఓ గృహిణి.. ఖాళీ టైమ్‌లో ఫొటో ఫ్రేమ్‌లు తయారు చేస్తూ ఇంట్లో అలంకరిస్తారు. పరిచయస్తులకు, బంధువులకు ఇస్తుంటారు. ఓ కాలేజీ స్టూడెంట్.. పాత సీడీల వంటి ‘ఈ వేస్ట్’తో వెరైటీ గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేస్తాడు. ఇంట్లో పెట్టుకున్నవి మినహా మిగిలినవి అందరికీ ఇచ్చేస్తుంటాడు. వీళ్లిద్దరూ తమ హస్తకళలు బాగున్నాయనే పొగడ్తలు అందుకుంటారు. మరి.. సేల్స్ చేయవచ్చు కదా..! అంటే అమ్మో.. మన దగ్గర షాప్ పెట్టేంత కేపిటల్ ఎక్కడ? ఊరికే ఇస్తున్నాం కాబట్టి గానీ అమ్మితే ఎవరైనా కొంటారా? అనేస్తారు. అయితే ఆ గృహిణి, స్టూడెంట్ ఇక అలాంటి అనుమానాలు లేకుండా, పెద్ద పెట్టుబడి అవసరం లేకుండా తమ వస్తువులను అమ్ముకోవచ్చు. అదెలా అంటారా.. అదే ఫ్లీ మార్కెట్.
 
బంజారాహిల్స్‌లో ఒక పెద్ద హోర్డింగ్. అందులో ఏముందంటే.. ‘ఈ నెల 11న అతి పెద్ద ఫ్లీ మార్కెట్‌ను   అవర్ ప్లేస్ హోటల్‌లో నిర్వహిస్తున్నాం సంప్రదించండి’ అని. చాలామంది దాన్ని యథాలాపంగా చూసి వెళ్లిపోవచ్చు. కానీ దాని గురించి తెలిసిన కొందరు మాత్రం..  తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్‌గా గుర్తిస్తారు. ‘మేం అవర్‌ప్లేస్‌లో పెట్టిన ఫ్లీ మార్కెట్‌కు అంత పబ్లిసిటీ ఇవ్వడానికి కారణం అవి ఉపయోగపడాల్సిన వాళ్లకి ఉపయోగపడాలనే’ అంటారు సదరు మార్కెట్ నిర్వాహకురాలు శశినెహతా.
 
ఏమిటీ ఫ్లీ మార్కెట్..
విదేశాల్లో ఇంట్లో నిరుపయోగంగా ఉన్న సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం కోసం ప్రత్యేకంగా దీన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. అవిప్పుడు ప్రపంచవ్యాప్త ట్రెండ్‌గా మారి రకరకాలుగా తమ పరిధిని విస్తరించుకున్నాయి. దీనిలో ఎవరైనా, ఎలాంటి ఉత్పత్తితో అయినా పాల్గొనవచ్చు. అయితే ఈ ఉత్పత్తులు తయారు చేసిన వారికి ఎటువంటి స్టోర్స్ గానీ మరే మార్కెటింగ్ సాధనం గానీ ఉండకూడదు. ఆన్‌లైన్ స్టోర్స్ ఉంటే ఫర్వాలేదు. ఈ తరహా ఫ్లీ మార్కెట్లను నగరంలో కొందరు ఆర్గనైజ్ చేస్తూ నామమాత్రపు రుసుం వసూలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని లామకాన్, సప్తపర్ణి, సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్.. ఇలా పలు చోట్ల ఈ మార్కెట్లు అన్నీ వారాంతాల్లోనే నిర్వహిస్తుండడం వల్ల అటు వినియోగదారులకు, ఇటు పార్ట్‌టైమ్ వ్యాపారవేత్తలకు వెసులుబాటుగా ఉంటోంది.  

‘గత ఆర్నెల్లుగా ఈ ఫ్లీ మార్కెట్ల నిర్వహణకు యువత బాగా ముందుకు వస్తున్నారు’ అని చెప్పారు సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్ నిర్వాహకురాలు నయనతార. తమ దగ్గరకు ఫ్లీ మార్కెట్ నిర్వహిస్తామంటూ వచ్చేవారు బాగా పెరిగారని, అయితే తమ పరిమితుల దృష్ట్యా నెలకు ఒకసారి మాత్రమే వీటిని అనుమతిస్తున్నామన్నారు. ‘యువత క్రియేటి వ్ వర్క్ చేస్తున్నారు. ఇలా ఒక చోటుకి రావడం మంచి అవకాశం  మార్కెట్లో అందుబాటులో లేనివి, ఎన్నడూ చూడని ఎన్నో అద్భుతమైన క్రియేటివ్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుతున్నాయి.’ అంటారామె.  
 
 రిటైర్డ్ ఉద్యోగులూ రెడీ అంటున్నారు..
 ‘తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు 16 ఏళ్ల టీనేజర్ నుంచి 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు మేం ఏర్పాటు చేసే ఫ్లీ మార్కెట్స్‌లో పాల్గొంటున్నారు. ఆశ్చర్యపరిచే క్వాలిటీతో పాటు రీజనబుల్ ధరలతో వీరు ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు.’ అని చెప్పారు ట్రీ హగ్గర్స్ పేరుతో ఈ తరహా మార్కెట్లను గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న సుప్రీత. గూగుల్‌లో ఉద్యోగం వదిలేసి మరీ ఆమె ఈ రంగంలోకి మరో పార్ట్‌నర్‌తో కలిసి ప్రవేశించారు. ఎంతో మంది క్రియేటివ్ పీపుల్ మన చుట్టూ ఉన్నారని, అయితే వారి క్రియేటివిటీకి సరైన గుర్తింపు విలువ దక్కడం లేదనే ఆలోచనే తనను ఈ ఫ్లీ మార్కెట్ల నిర్వహణ వైపు నడిపించిందంటున్న సుప్రీత.. ప్రస్తుతం తమ దగ్గర 300 మంది రెగ్యులర్ క్లయింట్లు (స్టాల్స్ నిర్వాహకులు) ఉన్నారని చెబుతున్నారు. వివరాలు కావల్సిన వారు 97015 95204, 97015 87405 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారామె.
 

మరిన్ని వార్తలు